తెలంగాణ సీఎం కేసీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వయోవృద్ధుల సేవల కోసం హెల్ప్‌లైన్ వాహనం ఏర్పాటుచేశామని చెప్పారు. వయోవృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారని తెలిపారు. కరీంనగర్‌లో ఏర్పాటుచేసిన సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్‌ను మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. తెలంగాణలో వయోవృద్ధుల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధుల కోసం డేకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఒంటరిగా ఉంటే అనారోగ్యం.. పది మందితో ఉంటే ఆరోగ్యం అని చెప్పారు. సీఎం కేసీఆర్ హయాంలో హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా కరీంనగర్ అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు.
మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జిల నిర్మాణంతో త్వరలోనే సింగపూర్ తరహాలో కరీంనగర్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. సమైక్య పాలనలో గత ప్రభుత్వాలు పేదలను పట్టించుకోలేదని విమర్శించారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. మేనమామలా పేదింటి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి ఇస్తున్నారని వెల్లడించారు.