Home / EDITORIAL / తెలంగాణ ఇంటింటా సంక్షేమం

తెలంగాణ ఇంటింటా సంక్షేమం

‘తెలంగాణ వస్తే మీ ప్రాంతం చీకటైతది. బతుకులు ఆగమైపోతయి’..? ఇది నాడు సమైక్య రాష్ట్రంలో నాయకుల ఎద్దేవా! కానీ, తొమ్మిదేండ్ల రాష్ర్టాన్ని చూస్తే సకల జనుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని బీఆర్‌ఎస్‌ సర్కారు సబ్బండవర్గాలకు అండగా నిలుస్తున్నది. పల్లె, పట్టణం అనే తేడాలేకుండా అభివృద్ధిని కండ్ల ముందే చూపిస్తూ, కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ఫలాలను అందిస్తున్నది. గొల్లకుర్మలకు గొర్రెలు, మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ,

రజకులు, నాయీబ్రాహ్మణుల లాండ్రీ షాపులు, సెలూన్లకు విద్యుత్‌ రాయితీ, పేద విద్యార్థుల విదేశీ చదువుల కోసం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌, అసహాయులకు ‘ఆసరా’, ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్‌’, ‘డబుల్‌బెడ్రూం ఇండ్లు’, ‘ముఖ్యమంత్రి సహాయనిధి’, ‘కేసీఆర్‌ కిట్ల’తో పేదలకు అండగా నిలుస్తూనే, గ్రామీణ కులవృత్తులకు జీవం పోస్తున్నది. దళితబంధుతో దళితుల దశాబ్దాల వెనుకబాటుతనాన్ని దూరం చేస్తూనే, వ్యవసాయరంగ చరిత్రలోనే నిలిచిపోయే ‘రైతుబంధు’ పథకం, రైతుకు ఏదైనా జరిగితే కుటుంబం ఆగం కాకుండా రైతు బీమాను అమలు చేస్తున్నది. ఇంకా విద్య, వైద్యంతోపాటు అన్ని రంగాలకు సమప్రాధాన్యమిస్తూ, తొమ్మిదేండ్లలోనే విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి భరోసా కల్పిస్తున్నది.

రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం అవతరించి దశాబ్ది వేడుకలు జరుపుకుంటుండగా, సీఎం కేసీఆర్‌ పాలనలోని బీఆర్‌ఎస్‌ సర్కారు తొమ్మిదేండ్లలోనే సకల జనుల పెన్నిధిగా మారింది. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలను పక్కాగా అమలు చేస్తున్నది. నిరుపేదలకు ఆహార భద్రత కల్పించి, బడుగులకు కొండంత ‘ఆసరా’ కల్పిస్తున్నది. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్‌’ కింద రూ.లక్షా నూట పదహార్లు, నీడ లేని నిరుపేదలకు ‘డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తూనే, నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు, మహిళా స్వశక్తి సంఘాలకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నది. విద్యా రంగాన్ని బలోపేతం చేసింది. కేజీ టూ పీజీలో భాగంగా గురుకులాలను ఏర్పాటు చేస్తున్నది. వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యం అన్నం పెడుతున్నది. స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది.

మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా కేసీఆర్‌ కిట్లు ఇస్తున్నది. సర్కారు దవాఖానాల్లో మెరుగైన వసతులు కల్పించి, ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దింది. వ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్నది. విత్తనాలు, ఎరువులు, సబ్సిడీ రుణాలు, యంత్రాలు ఇవ్వడమే కాకుండా, రైతన్నకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నది. కులవృత్తులకు పునర్జీవం పోస్తున్నది. ప్రేరణ పథకం కింద ఒక్కొక్కరికి రూ.50 వేల సాయం చేస్తున్నది. ఇంకా గొల్లకుర్మలకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నది. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తూ రాయితీపై మోపెడ్లు, వలలు అందిస్తున్నది. రజకులు, నాయీ బ్రాహ్మణుల లాండ్రీ షాపులు, సెలూన్లకు 250 యూనిట్ల విద్యుత్‌ రాయితీ, పేద విద్యార్థుల విదేశీ చదువుల కోసం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తున్నది. దళితుల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం దళితబంధు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. వ్యవసాయ రంగ చరిత్రలోనే నిలిచిపోయే ‘రైతుబంధు’ పథకం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున సాయం అందిస్తున్నది. రైతుకు ఏదైనా జరిగితే కుటుంబం ఆగం కాకుండా రైతు బీమా కింద రూ.5 లక్షల సాయం చేస్తున్నది.

పింఛన్‌ డబ్బులే మల్లమ్మకు దిక్కైనై..

..ఈమె పేరు సింగిరి మల్లమ్మ. ఊరు మంథని మండలం ఎక్లాస్‌పూర్‌. వయస్సు 80 ఏండ్లు. ఈమెకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. భర్త లింగయ్య ఏడాది కిందే కాలంజేసిండు. కన్నబిడ్డలు ముగ్గురికీ పెండ్లిళ్లు అయి ఎవరి బతుకులు వాళ్లు బతుకుతున్నరు. ఈమె మాత్రం ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యం, పింఛన్‌ డబ్బులతో జీవిస్తున్నది. ‘నాకు నా కొడుకు సీఎం కేసీఆర్‌ సార్‌ ఇచ్చే రూ.2016 వేల పెన్షన్‌నే దిక్కయ్యింది. ఆ పైసలతోనే దుకాన్ల సామాను కొనుక్కుంట.. ఏమైనా పైసలు మిగిలితే దాచిపెట్టుకొని ఏదన్నా రోగమో, నొప్పొ, అత్తే ఖర్సు పెట్టుకుంటున్న అంటున్నది’ సింగిరి మల్లమ్మ.

కేసీఆరే నా పెద్ద కొడుకు..

తెలంగాణ సీఎం కేసీఆరే నాకు పెద్ద కొడుకైండు. నాకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నది. నా భర్త గట్టయ్య పదేండ్ల కింద సచ్చి పోయిండు. కొడుకులు, బిడ్డకు పెండ్లి జేసిన. ఎక్కడోళ్లు అక్కడ బతుకుతున్నరు. నాలుగేళ్లుగా నాకు తెలంగాణ సర్కారు పెన్షన్‌ ఇస్తంది. కొడుకులు, బిడ్డలు పెడ్తరని ఎదురు చూడకుండా నెలనెలా సర్కారిచ్చే ఆ పైసలతోనే బతుకుతన్న.

– డాంకా మధునమ్మ, ఎక్లాస్‌పూర్‌, మంథని మండలం

పార్టీలకతీతంగా, పైరవీలు లేకుండా..

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పార్టీలు, రాజకీయాలకతీతంగా, పైరవీలు లేకుండా అందుతున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. మానకొండూర్‌ మండలం శ్రీనివాసనగర్‌కు చెందిన బీజేపీ నాయకుడు శానగొండ రవి – మంగ దంపతుల ఏకైక కూతురు శ్వేతకు చిగురుమామిడి మండలం ఉల్లంపల్లికి చెందిన శ్రీనివాస్‌తో గతేడాది ఆగస్టు 17న మానకొండూర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్లో వివాహం జరిగింది. అందరిలాగే రవి తన కూతురుకు కూడా కల్యాణలక్ష్మి పథకం కింద రూ.1,00,116 వస్తాయనే నమ్మకంతో అన్ని పత్రాలు సేకరించి దరఖాస్తు చేసుకున్నాడు. అతను బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి అని చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం రవి భార్య మంగ పేరున రూ.1,00,116 చెక్కును మంజూరు చేసింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఈ చెక్కు పట్టుకుని స్వయంగా రవి ఇంటికి వెళ్లి అందించారు.

ఆ సమయంలో రవి భార్య మంగ ఆశ్చర్యానికి గురైంది. చెక్కుతోపాటు ఎమ్మెల్యే చీర సారె కానుకగా అందించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక చెల్లి కూతురు పెండ్లికి మేనమామలా పుట్టింటి కానుకలు అందించినట్లుగా ఉందని చెప్పి ఎంతో సంతోషించింది. ఎమ్మెల్యే రసమయిని అన్నలా భావించి శాలువాతో సత్కరించి తన అభిమానాన్ని చాటుకుంది. ఇంతకు ముందు ఇదే మండలంలోని ఓ కాంగ్రెస్‌ నాయకుడి కుటుంబానికి కూడా ఎమ్మెల్యే ఇదే విధంగా కల్యాణలక్ష్మి చెక్కును అందించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పార్టీలు, రాజకీయాలకతీతంగా జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక ప్రబల నిదర్శంగా చెప్పవచ్చు. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యాకర్తలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చేది. పైరవీలు లేకుండా ఏ పథకం ప్రజలకు చెంతకు చేరేది కాదు. ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ అందుతున్నాయి.

నేడు తెలంగాణ సంక్షేమ సంబురాలు

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తెలంగాణ సంక్షేమ సంబురాలు నిర్వహిస్తున్నారు. వెయ్యి మందికి పైగా ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులతో నియోజకవర్గ స్థాయిలో సభ ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తారు. గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీని ప్రారంభిస్తారు. గతంలో భూములు సేకరించిన చోట, అందుబాటులో ఉన్నచోట అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారు. వివిధ గ్రామీణ వృత్తి పనుల వారికి ఆర్థిక ప్రేరణ కింద రూ.లక్ష పంపిణీ పథకం ప్రారంభిస్తారు.

దారి చూపిన కల్యాణలక్ష్మి

మెట్‌పల్లికి చెందిన మ్యాడారం వీరబ్రహ్మం-కమల దంపతులకు నలుగురు కూతుళ్లు. 30 ఏండ్ల క్రితం కొంత ఆర్థికంగా బాగున్న కుటుంబమే. ఆ దంపతులు ఉన్నంతలో నలుగురు కూతుళ్లను చదివించి, అందులో ఇద్దరి వివాహం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మరో ఇద్దరు కూతుళ్లు సైతం పెండ్లికి ఎదిగారు. ఇంతలోనే వీరబ్రహ్మం కుటుంబం పరిస్థితి ఆర్థికంగా దెబ్బతిన్నది. అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో ఉన్న ఆర్థిక వనరులన్నీ కరిగిపోయాయి. కనీసం సొంత ఇల్లు సైతం లేని పరిస్థితి. ఆర్థికంగా దెబ్బతినడం, అనారోగ్యానికి గురికావడం, కూతుళ్ల వివాహం ఎలా చేసేదనే బాధ ఆ దంపతులను మరింత కుంగదీసింది. ఈ పరిస్థితుల్లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సీఎంగా కేసీఆర్‌ బాధ్యతలు స్వీకరించి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకానికి అంకురార్పణ చేశారు. మొదట్లో పథకం కింద లబ్ధిదారులకు రూ.50 వేలు అందజేసిన ప్రభుత్వం, తర్వాత రూ.75 వేలకు పెంచింది. ఇదే సమయంలో మూడో కూతురు రేఖ వివాహం చేశారు. ఆమెకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.75 వేల సాయం వచ్చింది.

చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో ప్రభుత్వం చేసిన సాయం ఆ కుటుంబానికి ఒక మార్గాన్ని చూపింది. ఐదేండ్ల క్రితమే వీరబ్రహ్మం అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో కుటుంబ భారం మొత్తం కమలపైనే పడింది. దీనికి తోడు మరో కూతురు రాణికి వివాహం చేయాల్సిన బాధ్యత ఏర్పడింది. మూడేండ్ల క్రితమే ఆమెకు సైతం వివాహం జరిపించింది. కల్యాణలక్ష్మి కింద కమల కుటుంబానికి ప్రభుత్వం రూ.లక్ష అందజేసింది. ఇలా వీరబ్రహ్మం-కమల దంపతుల ఇద్దరు కూతుళ్ల పెండ్లికి కల్యాణలక్ష్మి పథకం ఒక దారి చూపింది. “సీఎం కేసీఆర్‌ పెట్టిన కల్యాణలక్ష్మి పథకం నా పాలిట అమృతకలశం వంటిది. బంధువులు, రక్తసంబంధీకులు, ఐనవాళ్లు సైతం ఆపదలో ఆదుకోలేదు. గుండెలపై కుంపటిలా మారిన కూతుళ్ల వివాహం ఎలా చేయాలన్న బాధ, ఆర్థిక సమస్యలు తీవ్రంగా కలిచివేశాయి. అలాంటి సమయంలో సీఎం కేసీఆర్‌ పెట్టిన కల్యాణలక్ష్మి పథకం నన్ను ఆదుకుంది. సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటానంటోంది’ కమల.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat