తెలంగాణలో సమగ్ర, సమీకృత, సమ్మిలిత, సమతుల్య అభివృద్ధి జరుగుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. పిల్లలకు చిన్ననాటి నుంచే స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రతి మున్సిపాలిటీలో ఒక స్వచ్ఛ బడిని రూ.71 కోట్లతో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వీటితోపాటు మినీ స్టేడియం, వృద్ధ్దాశ్రమం కూడా ఏర్పాటు చేస్తామని, మూసీనది పనులను పూర్తి చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురసరించుకొని శుక్రవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి సంబురాల్లో మంత్రులు కేటీఆర్, వీ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. మున్సిపల్ శాఖ తొమ్మిదేండ్లలో సాధించిన అభివృద్ధి కార్యక్రమాల నివేదికను ఆవిష్కరించారు.
అనంతరం సఫాయి కార్మికులను శాలువాతో సన్మానించారు. చీర, నగదు బహుమతులు అందజేశారు. వివిధ క్యాటగిరీల్లో పట్టణ ప్రగతి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో పురపాలనలో దేశంలోనే అద్భుతమైన ప్రగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. 2022-23 సంవత్సరానికి మున్సిపల్ శాఖ 26 అవార్డులను సాధించిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌తోపాటు రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యక్రమాలకు ఇచ్చిన అనేక అవార్డులు, ప్రశంసలే ఇందుకు నిదర్శనమని చెప్పారు.