తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్‌బీపాస్) ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. సులువుగా ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఈ విధానాన్ని అమలు చేయడానికి ఇతర రాష్ర్టాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రతి పట్టణంలో ఇండ్ల నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు ఇస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది.
ఈ విధానం విజయవంతం కావడంతో పంజాబ్, తమిళనాడు తదితర రాష్ర్టాలు అమలు చేయడానికి ముందుకొచ్చాయి. దీని గురించి తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. ఈవిధంగా కూడా అనుమతులు ఇవ్వవచ్చా! అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ కూడా అధికారులతో స్వయంగా వచ్చి అధ్యయనం చేశారు. టీఎస్‌బీపాస్ ప్రజలకు మరింత మెరుగ్గా ఉండే విధంగా రాష్ట్ర అధికారులు మార్పులు చేస్తున్నారు. దీనిని రిజిష్ట్రేషన్ కార్యాలయాలతో అనుసంధానం చేసే ప్రక్రియ నడుస్తున్నది.
ఒకసారి ఈ ప్రక్రియ పూర్తి అయితే ఇక అక్కడి నుంచే భూ వివరాలు లభిస్తాయి. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడం, తిరస్కరించిన దరఖాస్తుదారుల డబ్బులు వెంటనే వారి ఖాతాల్లో జమచేయడం, వారి సందేహాలు తీర్చడానికి ప్రత్యేకంగా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటుచేశారు. దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూసేందుకు ఉన్నతాధికారులు వారానికి ఒకసారి సమీక్షిస్తున్నారు.
విచారణ నివేదికలు అందజేయడంలో జాప్యం చేస్తున్న వారి వేతనాల్లో కోత విధిస్తున్నారు. 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు అక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ)ను టీఎస్‌బీపాస్ ద్వారానే అందిస్తున్నారు. కూల్ రూఫ్ పాలసీని పకడ్బందీగా అమలు చేయడానికి టీఎస్‌బీపాస్ విధానంలో చేర్చారు. ఓసీ ఇచ్చే సమయంలో వారి ఇండ్లకు కూల్ రూఫ్ పాలసీని అమలు చేశారా? లేదా? అనేది పరిశీలించనున్నారు. కేంద్రీకృత విధానంలో అమలు చేస్తున్న టీఎస్‌బీపాస్ ద్వారా ప్రభుత్వ నిబంధనలు అన్నీ అమలు చేయనున్నారు.