కండ్ల ముందు పేదోడి కలల సౌధాలు ఆవిష్కృతం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంతిటి కలను నెరవేర్చేందుకు నిర్మించిన ఆదర్శ టౌన్‌షిప్ మరో చరిత్రను సృష్టించింది. సుమారుగా లక్ష జనాభా ఆవాసం ఉండే విధంగా ఒకేచోట ఏకంగా 15,660 ఇండ్ల నిర్మాణం చేపట్టింది. పేదల కోసం ఎంతో చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలతో కొల్లూర్ ఆదర్శ టౌన్‌షిప్‌ని నిర్మించింది.
క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా కార్పొరేట్ హంగులతో పేదల కోసం కలల సౌధాల నిర్మాణం చేపట్టింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామంలో పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఆదర్శ టౌన్‌షిప్‌ను గురువారం ఉదయం 11గంటలకు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కొల్లూర్ గ్రామంలో 145 ఎకరాల విస్తీర్ణంలో రూ.1432.5కోట్ల వ్యయంతో పేదల కోసం డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 117 బ్లాక్‌లు, అందులో జీ+9లో 38, జీ+10లో 24, జీ+11లో 55బ్లాక్‌లుగా నిర్మాణాలు చేపట్టారు.
ఒక్కో డబుల్ బెడ్‌రూం విస్తీర్ణం 580 ఎస్‌ఎఫ్‌టీ వరకు ఉంటుంది. ప్రతి బ్లాక్‌కు 2 లిఫ్ట్‌ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌లు, జనరేటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లోర్‌లో ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేశారు. 36 మీటర్లు, 30మీటర్ల ఔటర్ రోడ్లు, 8 మీటర్లు, 6 మీటర్ల ఇన్నర్ రోడ్లను వేశారు. 12అండర్ గ్రౌండ్ వాటర్ సంప్‌లను నిర్మించారు. ఒక్కో సంపు 11 లక్షల లీటర్ల సామర్థ్యం ఉంటుంది. 90లక్షల లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి ప్లాంటుని ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టారు. అండర్ గ్రౌండ్ ద్వారా కరెంట్ కేబుల్‌ని ఏర్పాటు చేశారు. మురికినీటి బాక్సులపై 10.55 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్‌ని ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం పనులు వందశాతం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. పేదవారికి సకల సౌకర్యాలతో కూడిన సరికొత్త నివాస ప్రాంతంగా ‘కొల్లూర్ ఆదర్శ టౌన్‌షిప్’ నిలువబోతున్నది.