ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది…అధికార వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయనే ధీమాతో ఉండగా…ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం పట్టణ ప్రాంతాల్లో ఉన్న కాస్త ప్రభుత్వ వ్యతిరేకతను పచ్చ మీడియా సహకారంతో మరింత పెంచి ఎన్నికల్లో విజయం సాధించి తీరాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ పార్టీని మూసివేయాల్సి వస్తుందని..లేకుంటే పార్టీ జూ. ఎన్టీఆర్ చేతిలోకి వెళ్లిపోతుందని చంద్రబాబు భయం..అందుకే తాను 70 ఏళ్ల ముదిమి వయసులో అర్థరాత్రి రోడ్ షోలు చేస్తూ… సొంత పుత్రుడు లోకేష్ తో పాదయాత్ర, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ తో వారాహి యాత్రలు చేయిస్తూ జగన్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నాడు..పచ్చ మీడియా ప్రచారంతో రెచ్చిపోతున్న చంద్రబాబు ఏపీలో టీడీపీ ప్రభంజనం వీస్తుందని..తాను గేట్లు తీస్తే వైసీపీ ఎమ్మెల్యేలంతా తమ పార్టీలోకి క్యూ కడతారంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు..ముఖ్యంగా టీడీపీ కంచుకోట అయిన ఉత్తరాంధ‌్ర గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు బీటలు వారింది..అక్కడ జనసేన కు కూడా కొద్దొగొప్పో ఉనికి ఉంది..అయితే ఈసారి ఉత్తరాంధ్రలో వైసీపీకి దెబ్బ తప్పదు అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఢంకా బజాయిస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలోకి భారీ వలసలు ఉంటాయని చెబుతున్నారు.
అయితే అసలు సీన్ వేరే ఉంది…ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేన కీలక నేతలు జగన్ సమక్షంలో అధికార వైసీపీలో చేరుతున్నారు. ఇటీవల రాజాంకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య , ఆయన కుమారుడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరడంతో చంద్రబాబుకు దిమ్మతిరిగిపోయింది…అలాగే అనకాపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నేతలు మలసాల భరత్ కుమార్ కుటుంబం
జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా గత సార్వత్రిక ఎన్నికలలో రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెందిన రాయపురెడ్డి ప్రసాద్ (చిన్న) వైఎస్సార్ సీపీలో చేరారు. జగ్గంపేట మండలం ఇర్రిపాక వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ద్వారా చిన్న కలుసుకున్నారు. పార్టీ లో చేరేందుకు ఆసక్తి చూపడంతో ఆయనను సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు.
రాయపురెడ్డి చిన్న రాకతో వైఎస్సార్ సీపీకి మరింత బలం చేకూరిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ పేర్కొన్నారు. 30 ఏళ్ళుగా తమ తండ్రి జక్కంపూడి రామ్మోహనరావుకు వెన్నెంటి ఉండి పనిచేసిన రాయపురెడ్డి చిన్న బుధవారం ఇర్రిపాకలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జనసేనకు పెద్ద షాక్ తగిలినట్లు అయిందన్నారు. చిన్న తమ సొంత మనిషి అన్నారు. జక్కంపూడి రామ్మోహనరావు మరణం అనంతరం కూడా తమతో కలిసి పయనించడమే కాకుండా స్థానిక కంబాలచెరువు వద్ద జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారన్నారు. చిన్నకు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో మంచి కేడర్ ఉందని, సొంత సొమ్ము ఖర్చు చేసి ఎంతోమందికి సహకారం అందించారన్నారు. అటువంటి నాయకుడు ఇప్పుడు తమ పార్టీలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మరింత భారీ మెజార్టీతో రాజానగరంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే టీడీపీ, ఇతర పార్టీల నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా పనిచేసినవారు పెద్ద ఎత్తున పార్టీలో చేరనున్నారని తెలిపారు. త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి తమ సత్తా చాటుతామన్నారు.
ఇక జనసేన నుంచి వైసీపీలో చేరిన రాయపురెడ్డి చిన్నా మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగనన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలనకు ఆకర్షితుడనై వైఎస్సార్ సీపీలో చేరానన్నారు. వచ్చే ఎన్నికల్లో జక్కంపూడి రాజా అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. తాను జక్కంపూడి కుటుంబంలో ఒక సభ్యుడినేనని అనివార్య కారణాలతో బయటకు వెళ్లానని చిన్న చెప్పుకొచ్చారు. మొత్తంగా ఎన్నికల ముందు టీడీపీ, జనసేన పార్టీల నుంచి వైసీపీలోకి రివర్స్ లో వలసలు ఊపందుకోవడం చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది.