ఇండియా పేరును భారత్ గా మార్చాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ వార్తలపై తాజాగా దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగుతున్నాయి.
అయితే ఇండియా పేరు మార్చాలంటే రాజ్యాంగం మార్చాలా అనే అంశం ఇప్పుడు తెలుసుకుందాం.. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని వాడాలనుకుంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి తెలిపారు.
‘భారత్ వాడాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. ఆర్టికల్ 1ని మార్చాలి. ఐక్యరాజ్య సమితిలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఉంది. అక్కడ మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఆ తర్వాత దేశం పేరు మార్చామని అన్ని దేశాలకు సమాచారం పంపాలి’ అని పీడీటీ ఆచారి ఈ సందర్భంగా వివరించారు.
అయితే ఒకవేళ ‘భారత్’ అనే పేరును అధికారికంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ని సవరించాలి. ఆర్టికల్ 368 సాధారణ మెజారిటీ సవరణ లేదా ప్రత్యేక మెజారిటీ సవరణ ద్వారా రాజ్యాంగాన్ని సవరించడానికి అనుమతిస్తుంది.
కొత్త రాష్ట్ర ఏర్పాటు లేదా రాజ్యసభలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సీట్ల కేటాయింపు వంటి రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్.. హాజరైన మొత్తం సభ్యుల సంఖ్యలో సాధారణ మెజారిటీ (అంటే 50 శాతం కంటే ఎక్కువ) ద్వారా మార్చబడవచ్చు. ఆర్టికల్ 1 మార్పు సహా రాజ్యాంగంలో ఇతర మార్పుల కోసం ఆ సభకు హాజరై ఓటు వేసిన సభ్యులలో మూడింట రెండు వంతుల కంటే తక్కువ కాకుండా ప్రత్యేక మెజారిటీ (66 శాతం) అవసరం ఉంటుంది.కానీరాజ్యాంగంలోని ఆర్టికల్ 1 “భారతదేశం అంటే భారత్, రాష్ట్రాల యూనియన్గా ఉండాలి” అని చెబుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1’భారతదేశం’ ‘భారత్’ రెండింటినీ దేశానికి అధికారిక పేర్లుగా గుర్తిస్తూ స్పష్టంగా చెబుతోంది.
2016 మార్చిలో ఇండియా పేరును భారత్ గా మార్చాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్ పై అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాగూర్, జస్టిస్ యూయూ లలిత్ లతో కూడిన ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్లను విచారించబోమని పిటిషనర్ కు తెలిపింది. భారత్ అని పిలవాలనుకున్న వారు భారత్ అని.. ఇండియా అని పిలువాలనుకున్నవారు ఇండియా అని పిలుచుకోవచ్చని ధర్మాసనం తెలిపింది.