ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లోని కొంగర కలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు జిల్లా నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేశారు. ప్రపంచమే నివ్వెరపోయే విధంగా.. ఇది జనమా.. ప్రభంజనమా అని అనుకొనే విధంగా తండోపతండాలుగా ప్రగతి నివేదన సభకు తరలివచ్చిన అన్నదమ్ములకు, అక్కాచెళ్లెళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాభివందనాలు తెలిపారు. ప్రగతి నివేదన సభా వేదికపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సభను చూస్తుంటే 2001 నాటి జ్ఞాపకాలు తన కళ్ల ముందు స్మృతులు గుర్తుకు వస్తున్నాయి. ఈ అశేష ప్రజానీకాన్ని చూసి ప్రపంచమే అబ్బురపడుతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అలుసై పోయారు. గతంలో కరెంట్ ఛార్జీలు పెంచితే రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. నాటి ప్రభుత్వానికి అధికారమదంతో కళ్లు మూసుకుపోయాయి. కరెంట్ చార్జీలు తగ్గించమంటే కాల్చిపారేసిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. కరెంట్ చార్జీలకు వ్యతిరేకంగా తాను రాసిన లేఖతో ఉద్యమం మొదలైందని సీఎం తెలిపారు.
