ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఇవాళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన వేణుమాధవ్ మరణంపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్‌రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. తాజాగా వేణుమాధవ్ మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగ్గ హాస్యనటుడని..మంచి గుర్తింపు పొందిన నటుడిగా ఆయన అంచెలంచెలుగా ఎదిగారని ఉత్తమ్ అన్నారు. . ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. ఇవాళ స్వర్గస్థులైన వేణుమాధవ్ ఆత్మకు శాంతిచేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కాగా వేణుమాధవ్ స్వస్థలం కోదాడ..గతంలో ఇదే నియోజకవర్గానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. నియోజవర్గాల పునర్విభజనతో 2009 నుంచి ఉత్తమ్ కోదాడకు పక్కనే ఉన్న హుజూర్‌నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్పటి నుంచి రెండుసార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కోదాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పని చేశారు. కోదాడలో పుట్టి పెరిగి, చదువుకుని హైదరాబాద్‌కు వెళ్లి సినిమాల్లో పాపులర్ అయిన వేణుమాధవ్‌కు తన స్వస్థలం అంటే ఎంతో మమకారం. ఇప్పటికీ కోదాడలో వేణుమాధవ్ బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వేణుమాధవ్ మృతితో కోదాడలో విషాదం అలుముకుంది.
