ప్రేమ కోసం మతిస్థిమితం కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకరు శుక్రవారం ఉదయం కలకలం సృష్టించాడు. తన ప్రేమ వల్ల వృత్తినేకాదు వ్యక్తిగత జీవితాన్నీ సరవ నాశనం చేసుకున్నాడు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 3లో నాగార్జున సర్కిల్ వద్ద మతిస్థిమితం లేని వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ఇబ్బందులకు గురిచేసాడు. జనాలపై రాళ్ల తో దాడి చేసే ప్రయత్నించగా, భయాందోళనకు గురైన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులపై కూడా అతడు దాడికి దిగాడు. కొద్దిసేపు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని తాడుతో కట్టేసి ఆటోలో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
దాదాపు గంట సేపు రోడ్డుపై హంగామా చేయడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వాహనాలు నిలిచిపోయాయి. మెహదిపట్నం, హైటెక్ సిటీకి వెళ్లే దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై వీరంగం సృష్టించిన వ్యక్తిని రక్ష రాజు గా పోలీసులు గుర్తించారు. అతడు డెలాయిట్ కంపెనీలో పనిచేస్తున్నాడని కనుగొన్నారు. తన ప్రేమ విఫలం అవ్వడం వల్ల మతిస్థిమితం కోల్పోయి మూడు రోజులుగా రోడ్లపై తిరుగుతున్నట్టు గుర్తించారు. తిరుమలగిరి ప్రాంతంలో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.