టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త వినిపించింది. గరుడ ప్లస్ ఛార్జీలు తగ్గించింది. ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు టీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నది. ఏసీ గరుడ ప్లస్ ఛార్జీలను రాజధాని టిక్కెట్టుకు సమానంగా సవరించారు. దీంతో ప్రయాణీకులు రాజధాని ఛార్జీతో గరుడ ప్లస్ బస్సులో ప్రయాణించొచ్చు అని స్పష్టం చేశారు.
సవరించిన, తగ్గించిన ఛార్జీలు.. ప్రత్యేక సర్వీసులకు మార్చి 31 వరకు వర్తించనున్నాయి. కాగా, అంతరాష్ట్ర సర్వీసుల్లో అయితే తెలంగాణ సరిహద్దు దాటిన తరువాత అంతకు ముందున్న అంతరాష్ట్ర భాగంలో వర్తించే ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో నడిచే ఏసీ సర్వీసులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేశారు.
రవాణా రంగంలో ఉన్న పోటీని తట్టుకుని నిలబడడానికి ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంస్థ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ – విజయవాడ మధ్య రూ.100, హైదరాబాద్ – ఆదిలాబాద్ మధ్య రూ.111, హైదరాబాద్ – భద్రాచలం మధ్య రూ. 121, హైదరాబాద్- వరంగల్ మధ్య రూ.54 తగ్గినట్లు ఆయన వివరించారు .