దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పాలనలో మత్స్యకారుల అభివృద్ధి జరిగిందని .. మత్స్యకారుల ప్రతి ఇంటా నేడు సంతోషాలు నెలకొన్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ఈ రోజు శుక్రవారం బాల్కొండ నియోజకవర్గం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నాగపూర్ పాయింట్ వద్ద 62.86 లక్షల ఉచిత చేప పిల్లలను మంత్రి ప్రశాంత్ రెడ్డి వదిలారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. చేప పిల్లలు విడుదల చేసే క్రమంలో నూతనంగా చేపపిల్లలు కౌంటింగ్ చేసే మిషన్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.చేప పిల్లల విడుదలలో అవకతవకలు జరగకుండా కచ్చితంగా విడుదల చేసిన చేపపిల్లలను ఈ మిషన్ లెక్కిస్తుందన్నారు.
ఏ దళారీ ప్రమేయం లేకుండా..పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా చేప పిల్లల పంపిణీ జరుగుతుందన్నారు.మత్స్యకారులనే ఇందులో భాగస్వామ్యం చేయడం వల్ల వందల కోట్ల సంపద సృష్టి జరిగి వృత్తి దారుల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. ఈ ఏడాది ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 1043 చెరువుల్లో 4.85 కోట్ల చేప పిల్లలు విడుదలకు ప్రణాళిక చేశామన్నారు. వీటి ద్వారా సుమారు 500 కోట్ల సంపద సృష్టి జరగనుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.