తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో త్వరలోనే 300 కొత్త ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్.. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీలో పని చేసే సిబ్బందికి అక్టోబర్‌లో వేతనంతోపాటు ఒక డీఏను ఇవ్వబోతున్నట్టు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలో సంతృప్తికరమైన నిర్ణయాలు తీసుకొన్నట్టు బాజిరెడ్డి చెప్పారు.
ఈ మేరకు బాజిరెడ్డి గోవర్ధన్ నిన్న సోమవారం మీడియాకిచ్చిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అతి త్వరలో విడతలవారీగా 1200 ఉద్యోగాలకు కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు.ఆర్టీసీ ప్రత్యేక బ్రాండ్‌తో జీవ వాటర్ బాటిళ్లను ప్రారంభిస్తామన్నారు.
గత ఏడాది కాలంలో ఆర్టీసీని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అనేక చర్యలు తీసుకొన్నట్టు వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని డిపోలను లాభాల బాటల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపారు. సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎండీ వీసీ సజ్జనార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రీజినల్ మేనేజర్లు, డిప్యూటీ రిజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు, సిబ్బంది అందరికీ శుభాభినందనలు తెలియజేశారు.