టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి పార్టీలో తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు.. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దెబ్బతో రేవంత్‌రెడ్డి స్వయంగా నిర్ణయించి ప్రకటించిన నల్లగొండ నిరుద్యోగ నిరసన దీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది.
దీంతో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ పోరులో అసలు కాంగ్రెస్‌దే పైచేయిగా నిలిచింది.ఉత్తమ్, రేవంత్ మధ్య నిరుద్యోగ నిరసన దీక్ష అగ్గి రాజేసింది. ఈ నెల 21న నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్షను నిర్వహిస్తున్నట్టు మంగళవారం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ఆయన ప్రకటనపై ఉత్తమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, తనతో చర్చించకుండా, తన జిల్లాలో ఏ విధంగా సభ నిర్వహిస్తారని బహిరంగంగానే నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతోపాటు రేవంత్‌రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.