దేశంలో సార్వత్రిక ఎన్నికలుగానీ, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలుగానీ వచ్చాయంటే చాలు బీజేపీ నేతలు తమ నోళ్లకు పని చెబుతారు. కుల, మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు రేపుతారు.
ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా ఓ మతాన్ని పొగుడుతూ, మరో మతాన్ని కించపరుస్తారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. దాంతో అక్కడి బీజేపీ నేత తాజాగా అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు.
కర్ణాటక బీజేపీ నాయకుడు, ఆ రాష్ట్ర మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఒక మతాన్ని కించపరిచారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఒక్క ముస్లిం ఓటు కూడా అక్కర్లేదని దురుసు వ్యాఖ్య చేశారు. సోమవారం శివమొగ్గలో వీరశైవ, లింగాయత్‌ల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మత మార్పిళ్లపై ప్రసంగిస్తూ ఈశ్వరప్ప పరుషంగా మాట్లాడారు.