వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ సేవలు అందిస్తున్నదని మరోసారి నిరూపితమైంది. కొవిడ్ మహమ్మారి విజృంభించిన వేళ ఆరోగ్య సూచీలో రాష్ట్రం మెరుగైన స్థానంలో నిలవడమే దీనికి తార్కాణం. దేశవ్యాప్తంగా 2020-21 సంవత్సరానికిగానూ నీతిఆయోగ్ నిర్వహించిన ఆరోగ్య సూచీ సర్వేలో పెద్ద రాష్ర్టాల విభాగంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.
నీతిఆయోగ్, కేంద్ర ఆరోగ్యశాఖ, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెలుగు చూసిన వాస్తవం ఇది. దీంతో సర్కారీ వైద్య సేవలపై రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్నవి పసలేని ఆరోపణలని మరోసారి తేలిపోయింది.కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సారథ్యంలో తెలంగాణ కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నది.
గత ఏడాది ఇంక్రిమెంటల్ పనితీరులో ప్రథమ స్థానంలో, ఈ ఏడాది మొత్తం ఆరోగ్యపరంగా పనితీరులో తృతీయ స్థానంలో తెలంగాణ నిలిచింది. అయితే ఈ అధ్యయనం పూర్తయినప్పటికీ బీజేపీ పాలిత రాష్ర్టాల పనితీరు అధ్వాన్నంగా ఉండటంతో ఈ నివేదికను నీతిఆయోగ్ బయట పెట్టలేదు. 2022 డిసెంబర్‌లోనే ఈ ఆరోగ్య సూచీ నివేదిక విడుదల కావాల్సి ఉన్నా ఇప్పటికీ విడుదల కాకపోవడం శోచనీయమని ఈ నివేదికను బయటపెట్టిన ఒక ఆంగ్ల దినపత్రిక పేర్కొన్నది. నీతిఆయోగ్ నిర్వహించిన ఈ ఐదో ఆరోగ్య సూచీ అధ్యయనంలో మొత్తం పనితీరు విభాగంలో కేరళ, తమిళనాడు, తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. బీహార్(19), ఉత్తరప్రదేశ్(18), మధ్యప్రదేశ్(17) అట్టడుగున నిలిచాయి.