యావత్ భారతదేశంలో ఫ్రెండ్లి పోలీస్ ఉన్నది ఒక్క తెలంగాణా లోనే నని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.షి టీమ్స్ తో మహిళలకు సంపూర్ణ రక్షణ కలిపిస్తున్న రాష్ట్రంగా తెలంగాణా ఘనతి కెక్కిందని ఆయన చెప్పారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్దిఉత్సవాలు సూర్యాపేటలో ఘనంగా కొన సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం రోజున సూర్యాపేట పోలీస్ యంత్రాంగం నిర్వహించిన సురక్ష దినోత్సవానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
సూర్యాపేట డి యస్ పి నాగభూషణం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్ పి వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్ ,కలెక్టర్ వెంకట్రావు, యస్ పి రాజేంద్ర ప్రసాద్ డి యస్ పి లు వెంకటేశ్వర రెడ్డి,రవి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కొత్త బస్ స్టాండ్ నుండి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వరకు యస్ పి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం నిర్వహించిన ర్యాలీనీ మంత్రి జగదీష్ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కక్షలు కార్పణ్యాలతో తల్లడిల్లిన పల్లెల్లో శాంతి కపోతాలు ఎగురు తున్నాయి అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత అని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను తూ. చ తప్పకుండా పోలీస్ శాఖా అమలు పరుస్తున్నందునే తొమ్మిదేళ్లలో శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగ లేదన్నారు.ఫ్రాక్షన్ విలేజీల్లోనూ ప్రశాంతత ఫరీడవిల్లుతున్నది అంటే ప్రజా క్షేమం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుతున్న చొరవ మాత్రమే నన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో శాంతి బద్రతలను పరిరక్షించేందుకే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు అని అది ఇప్పుడు దేశానికే దిక్సూచి గా మారిందన్నారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా కట్టడిలో ఉన్నందునే పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి 50 వేల పరిశ్రమలు నెలకొల్పారన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనను పోలీస్ శాఖా అమలు పరుస్తునందునే తెలంగాణా పోలీస్ అద్భుత విజయాలు నమోదు చేసుకుందన్నారు.