తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇండస్ట్రియల్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించి.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గడిచిన తొమ్మది ఏళ్లలో పారిశ్రామిక రంగం సాధించిన విజయాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏవీని వీక్షించారు. ఈ సందర్భంగా ఇండస్ట్రియల్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. గతంలో ఇతర ప్రభుత్వాల హయాంలో సరైన వసతులు లేక పరిశ్రమలు ముత పడేవని. కరెంటు లేక పవర్ హాలిడేస్ ఉండేవని, అనేక ఇబ్బందులతో ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహించామని అయిన తమ సమస్యలు పరిష్కారం కాలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నిరంతర విద్యుత్ అందించి పారిశ్రామిక రంగానికి ఊపిరి పోసిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మెరుగైన వసతులు ఉన్నందున అనేక దిగ్గజ సంస్థలు హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నాయన్నారు. ఇది కేవలం సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యపడిందని హర్షం వ్యక్తం చేశారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న తమకు ప్రభుత్వం ఎనలేని సహకారం అందించి ప్రోత్సహించినందుకు సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టీఎస్ ఐపాస్ కింద 2226 పరిశ్రమలకు వివిధ శాఖల నుండి 4650 అనుమతులు ఇప్పించడం జరిగిందన్నారు. వీటిలో 2198 పరిశ్రమలు రూ.3175 కోట్ల పెట్టుబడితో స్థాపించబడి, దాదాపు 33,708 మందికి ఉపాధి కల్పిస్తూ నడుస్తున్నాయన్నారు. మిగిలిన పరిశ్రమలు వివిధ దశలలో ఉన్నాయని, త్వరలో అవి కూడా ఉత్పత్తి ప్రారంభిస్తాయన్నారు. టీఎస్ ఐపాస్ చట్టం అమలులో మేడ్చల్ జిల్లా 2019 సంవత్సరంలో ఉత్తమ జిల్లా అవార్డు అందుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 4242 పరిశ్రమలు ఉండగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కేవలం పదేళ్లలో 2198 పరిశ్రమలు స్థాపించబడ్డాయని.. అంటే 52% పెరుగుదల నమోదు చేసుకుందన్నారు. అలాగే పెట్టుబడుల విషయంలో రాష్ట్రం ఏర్పాటుకు ముందు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో రూ.4625 కోట్లు పెట్టుబడులు కాగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక రూ.3175 కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. అంటే కేవలం పదేళ్లలో 68.6% పెరుగుదల నమోదు చేస్తుందన్నారు.
ఉపాధి విషయంలో రాష్ట్రం ఏర్పాటుకు ముందు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో పరిశ్రమల ద్వారా 62259 మంది ఉపాధి పొందగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కేవలం పదేళ్లలో ఇంకో 33,708 మంది ఉపాధి పొందుతున్నారని, అంటే 54% పెరుగుదలను నమోదు చేసుకుందన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కెమికల్, ఫార్మా మరియు బల్క్ డ్రగ్ ఉత్పత్తులు ముఖ్యమైనవని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాంధీనగర్ సహకార పారిశ్రామికవాడ, జీడిమెట్ల పారిశ్రామికవాడ వీటిలో ముఖ్యంగా జీడిమెట్ల పారిశ్రామిక వాడ 6 దశలలో 443.98 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పడం జరిగిందన్నారు. ఈ పారిశ్రామిక వాడలో 560 పరిశ్రమలు రూ.1450 కోట్ల పెట్టుబడితో స్థాపించబడి, 4500 మందికి ఉపాధి కల్పిస్తూ నడుస్తున్నాయన్నారు. గాంధీనగర్ సహకార పారిశ్రామికవాడ 106.78 ఎకరాల విస్తీర్ణంలో.. 103 పరిశ్రమలు రూ.358 కోట్ల పెట్టుబడితో స్థాపించబడి, 2600 మందికి ఉపాధి కల్పిస్తూ నడుస్తున్నాయని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి జనరల్ కేటగిరి పారిశ్రామికవేత్తలకు (T-IDEA) పథకం కింద మరియు ఎస్సీ & ఎస్టీ కేటగిరి పారిశ్రామిక వేత్తలకు టీ-ప్రయిడ్ పథకం కింద వివిధ రాయితీలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 2-06-2014 నుండి 31-3-2023 వరకు T-IDEA పథకం కింద 937 అప్లికేషన్లకుగాను రూ.83.42 కోట్ల రాయితీలు మంజూరు చేయడం జరిగిందన్నారు. టీ-ప్రైడ్ పథకం కింద 02-06-2014 నుండి 31-03-2023 వరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 417 అప్లికేషన్లకు గాను రూ.21.52 కోట్ల రాయితీలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో అందరం ఇలాగే కలిసిమెలిసి సమాలోచనలు సమీక్షలు చేసుకుంటూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంను పారిశ్రామిక రంగంలో మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు వెళ్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో JIANMIA సర్వీస్ సొసైటీ చైర్మన్ సదాశివ రెడ్డి, JIA president Praveen Kumar రెడ్డి, CIE NMIA service సొసైటీ చైర్మన్ పి వెంకట్ రాజన్ గౌడ్, సెక్రెటరీ పి. స్వామి గౌడ్, TSIIC జోనల్ మేనేజర్ మాధవి, కమిషనర్ విజయ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్ రెడ్డి మరియు పారిశ్రామిక వేత్తలు, ఐలా సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు