సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి జయసుధ ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గంలో క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి కూడా అక్కడ నుంచే పోటీ చేయించాలని కాషాయ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. కాగా జయసుధ సమకాలీనురాలు, మరో ప్రముఖ సినీ నటి జయప్రద అధికార బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్టీఆర్ హయాంలో టీడీపీ నుంచి జయప్రద రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఎన్టీఆర్ కు వెన్నుపోటు తర్వాత చంద్రబాబుతో విబేధించిన జయప్రద సమాజ్ వాది పార్టీలో చేరి ఎంపీగా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తన రాజకీయ గురువు అమర్ సింగ్ చనిపోయిన తర్వాత జయప్రద రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా మారింది. ఓ దశలో మళ్లీ ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా జయప్రద మాత్రం తెలంగాణలో అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ లో చేరిన ఎంపీ అవ్వాలని పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ సైతం జయప్రదను పార్టీలో చేర్చుకుని మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు గులాబీ వర్గాల నుంచి టాక్ నడుస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ సంచలనం రేపుతోంది. మరాఠా గడ్డపై గులాబీ బాస్ నిర్వహించిన రోడ్ షోలు, బహిరంగ సభలకు మహారాష్ట్ర ప్రజలు పోటెత్తుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని ఎన్సీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో పెద్దఎత్తున చేరుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న రైతుబంధు, ఉచిత విద్యుత్తు, సాగునీరు, మిషన్ భగీరథ , దళితబంధు ఇతరత్రా అనేక సంక్షేమ పథకాలు తమకు కూడా కావాలని మహారాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణతో పాటు , భారీగా ఎంపీ సీట్లపై కన్నేసిన గులాబీ బాస్ జయప్రదను అక్కడ నుంచే బరిలోకి దించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జయప్రద , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమై పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం. త్వరలోనే ఓ మంచి ముహూర్తంలో జయప్రద బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇద్దరు అగ్రతారలైన జయసుధ, జయప్రదలు చెరో పార్టీలో చేరడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి జయప్రద గులాబీ కండువా కప్పుకుంటుందో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.