వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఉద్యోగ అవకాశ: కల్పిస్తామని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత ప్రకటించారు..మంగళవారం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులకు రూ. 6 లక్షల వరకు వడ్డీలేని రుణాలను అందిస్తామని తెలిపారు. సింగరేణి ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని కవిత టీబీజేకేఎస్ శ్రేణులను హెచ్చరించారు..గత ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల హక్కులను కాలరాశాయని ఆమె ధ్వజమెత్తారు. కార్మికుల సమస్యలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. మూతపడ్డ అనేక బొగ్గు బావులను మళ్లీ తెరిపించామని గుర్తు చేశారు. కార్మికులకు బొగ్గు బావుల్లో ఏసీ సదుపాయం కల్పిస్తామన్నారు. అంబేద్కర్ జయంతికి సెలవు ప్రకటిస్తామని ఎంపీ కవిత హామీ ఇచ్చారు.. ఇన్‌కమ్ ట్యాక్స్ విషయంలో జాతీయ సంఘాలు పట్టించుకోలేదన్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు కోసం టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడారని తెలిపారు. కార్మికులు టీబీజీకేఎస్‌ను గెలిస్తే మరిన్ని మంచిపనులు చేస్తామని ప్రకటించారు. ఎవరికి ఓటేస్తే సింగరేణి అభివృద్ధి చెందుతుందో కార్మికులు ఆలోచించాలని సూచించారు. సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని ఎంపీ కవిత ఉద్ఘాటించారు. సింగరేణి అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని స్పష్టం చేశారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో తమ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ తరపున టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుండగా ప్రతిపక్షాల కూటమి అయిన ఏఐసీటీయూ తరపున ప్రతిపక్ష నాయకులు ఎవరికి వారుగా ప్రచారం చేస్తున్నారు..టీఆర్ఎస్ ప్రచారం వ్యూహం ముందు ప్రతిపక్షాల ప్రచారం వెలవెలబోతుంది.
