తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు..ఔటర్ రింగ్ రోడ్డు కీసర వద్ద మంత్రి కాన్వాయ్‌ను వేగంగా వస్తున్న ఓ లారీ వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి తలసానికి, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్వల్ఫగాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే..ఈ రోజు ఉదయం మేడ్చల్ జిల్లా, షామీర్పేట మండంల, అంతయిపల్లి గ్రామంలో కొత్త కలెక్టర్ భవన నిర్మాణానికి మంత్రి తలసాని శంకుస్థాపన చేశారు. కార్యక్రమం అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డుపై కీసర సమీపంలో ఓ ప్లాస్టిక్ గూడ్స్‌లారీ మంత్రి కాన్వాయ్‌లోకి వేగంగా వస్తుండడం గమనించిన తలసాని కారు డ్రైవర్ వెంటనే తన కారును పక్కకు తీశాడు. ఇంతలోనే లారీ కారు వెనుక భాగాన్ని ఢీకొట్టాడు. దీంతో కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న మంత్రి తలసానికి, సుధీర్ రెడ్డి స్వల్ఫగాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
