10 జిల్లాల తెలంగాణ 31 జిల్లాల తెలంగాణగా పునర్విభజితమై ఏడాది పూర్తయిన సందర్భంగా అన్ని జిల్లాలలో సమీకృత కలెక్టరేట్లు, ఎస్సీ కార్యాలయాలు, ఇతర అభివృద్ధిపనులు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఆయా జిల్లాలలో మంత్రులు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనగా సీఎం కేసీఆర్ కూడా స్వయంగా సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాలలో పర్యటించి పలు భవన నిర్మాణ, అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు చేసి తదనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో ప్రసగించారు. ఈ రోజు ఉదయం సిద్ధిపేటకు వెళ్లి అక్కడి కార్యక్రమాలు ముగించుకుని సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లకు చేరుకున్నారు సీఎం కేసీఆర్. సిరిసిల్లలో కలెక్టరేట్, అపెరల్ పార్క్, తదితర నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సిరిసిల్ల ప్రాంతం కరువుతో బాధపడ్డ ప్రాంతం అని ఆవేదన చెందారు. కొత్త జిల్లాల పునర్విభజనలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నేతన్నలను ఆత్మహత్యలు చేసుకుంటే రూ. 50 వేలు ఇవ్వమని పాలకులను అడిగితే వారికి మనసు రాలేదని కేసీఆర్ పేర్కొన్నారు. భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు చనిపోతే తాము భిక్షమెత్తి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశామన్నారు. స్వరాష్ట్రంలో నేతన్నలకు రూ. వెయ్యి పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు.. మనం తప్ప అని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే చేనేత కార్మికులకు వాడే రంగులు, రసాయనాలు, నూలుపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని అన్నారు. చేనేత, పవర్లూమ్ కార్మికులను ఆదుకునేందుకు రూ. వెయ్యి కోట్లు కేటాయించడమే కాకుండా పవర్లూమ్ కార్మికుల నుంచి ప్రభుత్వ పథకాలకు అవసరమయ్యే వస్త్రాలు కొనుగోలు చేస్తున్నామని కేసీఆర్ ప్రజలకు వివరించారు.. బతుకమ్మ చీరల మీద ప్రతిపక్షాలు చిల్లర రాజకీయం చేశాయని సీఎం మండిపడ్డారు. చేనేత కార్మికులకు అన్యాయం చేసే ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు. అలాగే మన్నెవాగు జలాశయం పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ సిరిసిల్ల జిల్లాకు సాగునీరు అందించేందుకు రూ. 130 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలకు రేపే జీవో జారీ చేస్తామని ప్రకటించారు. బతుకమ్మ చీరల ఆర్డర్లతో తమకు ఆర్థికంగా భరోసాగా నిలబడిన సీఎం కేసీఆర్కు మద్దతుగా నేతన్నలు , సిరిసిల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభకు హాజరయ్యారు.
