గత ఏడాది సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ప్రకటన చేసినప్పుడు సిరిసిల్ల జిల్లా పేరు లేదు. అయితే సిరిసిల్ల ప్రజలు తమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలంటూ ఉద్యమం చేపట్టారు. దీంతో సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ ప్రజాభీష్టం మేరకు తన తండ్రి సీఎం కేసీఆర్ను ఒప్పించి కొత్త జిల్లాను సాధించుకున్నారు..దీంతో 31 జిల్లాల తెలంగాణలో సిరిసిల్ల కూడా చేరింది. కొత్త జిల్లాలు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా 31 జిల్లాలో సమీకృత కలెక్టరేట్ల భవన నిర్మాణాలకు శంకుస్థాపనలతో పాటు ఆయా జిల్లాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ స్వయంగా సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాలలో నూతన భవనాల నిర్మాణాలకు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం సిద్ధిపేటలో పర్యటించిన సీఎం కేసీఆర్ సాయంత్రానికి సిరిసిల్లకు చేరుకుని కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయం, అపెరల్ పార్కు, గ్రూప్ వర్క్ షెడ్ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సిరిసిల్లను జిల్లా చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ధి చేసుకుందామని కేటీఆర్ పిలుపు ఇచ్చారు. సిరిసిల్ల గురించి సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదని తెలిపారు. ముఖ్యమంత్రి వివాహం కూడా వేములవాడ ఆలయంలోనే జరిగింది. కొదురుపాక అల్లుడిగా ఈ నేలతో సీఎంకు ఎనలేని అనుబంధం ఉందని కేటీఆర్ తెలిపారు. మిషన్ కాకతీయతో చెరువులను బాగుచేసుకుంటున్నామని.. సిరిసిల్లలోని లక్షా 53వేల ఎకరాలకు 9 నెలల్లో సాగునీరు అందిస్తామని కేటీఆర్ వెల్లడించారు. రూ.1,283 కోట్లతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్దేని పునరుద్ఘాటించారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ.8వేల పెట్టుబడి ఇస్తానన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కేటీఆర్ వెల్లడించారు. సీఎం రాకతో సిరిసిల్లలో సందడి వాతావరణం నెలకొంది. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి తమకు ఆర్థికంగా భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్కు మద్దతుగా నేతన్నలు ఈ బహిరంగ సభకు భారీగా తరలిరావడం విశేషం.
