భారత్ జట్టుకి ఎంపికవడం తనకి మాటల్లో చెప్పలేనంత సంతోషానిచ్చిందని హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షిరాజ్ వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ కోసం ఈ యువ పేసర్‌ని భారత సెలక్టర్లు సోమవారం ఎంపిక చేశారు. హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటున్న మహ్మద్ గౌస్ కుమారుడైన షిరాజ్‌ని ఈ ఏడాది ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ రూ.2.6 కోట్లకి వేలంలో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మంచి లయతో బౌలింగ్ చేసిన షిరాజ్.. అందరి దృష్టినీ ఆకర్షించాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్.. నవంబరు 1 నుంచి ప్రారంభంకానుంది.
‘చాలా గర్వంగా ఉంది. 23 ఏళ్లకే నా కుటుంబ బాధ్యతలను మోసే స్థాయికి నేను వెళ్లగలిగాను. ఐపీఎల్ కాంట్రాక్ట్ వచ్చినప్పుడే మా నాన్నని ఇక ఆటో నడపకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకోమని చెప్పాను. ఎప్పటికైనా టీమిండియా నుంచి పిలుపు వస్తుందని నాకు తెలుసు. కానీ.. మరీ ఇంత తొందరగా వస్తుందని ఊహించలేదు. ఈ సంతోషాన్ని నేను మాటలతో చెప్పలేను. టీ20 జట్టుకి ఎంపికైనట్లు మా ఇంట్లోవాళ్లకి చెప్తే.. ఆనందంతో వాళ్ల నోటివెంట కాసేపు మాట రాలేదు. నా కల ఇప్పుడు నిజమైంది’ అని షిరాజ్ ఆనందం వ్యక్తం చేశాడు.