తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ కు చెందిన ప్రముఖ కంపెనీ బిన్ జాయెద్ గ్రూప్ తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణ ప్రభుత్వంతో కుదిరిన ఈ MoU మేరకు సుమారు 12500 కోట్ల రూపాయలను (రెండు బిలియన్ల అమెరికన్ డాలర్లను) తెలంగాణలోని మౌలిక వసతుల ప్రాజెక్టులపైన పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. బిన్ జాయెద్ గ్రూప్ చైర్మన్ అయిన షేక్ ఖాలేద్ బిన్ జాయెద్ అలితో తెలంగాణ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ ఈ రోజు దుబాయిలో సమావేశం అయ్యారు. అవగాహన ఒప్పంద కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చేపడుతున్న పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపైన ప్రత్యేకంగా చర్చించారు.
తెలంగాణ ప్రభుత్వ పాలసీల పైన, గత మూడు సంవత్సరాల్లో సాధించిన అభివృద్ధి, రాష్ట్రానికి ఆకర్షించిన పెట్టుబడుల వివరాలు తెలుసుకున్న షేక్ ఖాలెద్ బిన్ జాయెద్ అలి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ గ్రూపు సిద్ధంగా ఉందని తెలిపారు. కొత్త రాష్ట్రంగా తెలంగాణ సాధించిన ప్రగతి మరియు పెట్టుబడుల అవకాశాలను స్వయంగా పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాల్సిందిగా ఆయనను ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు బిన్ జాయెద్ గ్రూప్ రాష్ట్రంలోని రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు, హైదరాబాదులో నిర్మించనున్న గేమ్ మరియు యానిమేషన్ టవర్, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్, మిషన్ భగీరథ, తెలంగాణ పైబర్ గ్రిడ్ వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తుంది. త్వరలోనే తెలంగాణకు కంపెనీ ఒక ఉన్నతస్థాయి బృందాన్ని పంపించేందుకు ఈ సంస్థ అంగీకరించింది.
ఇండియా – యూఏఈ భాగస్వామ్య సదస్సులో ఇన్వెస్టర్లను ఆకట్టుకున్న తెలంగాణ రాష్ట్రం దుబాయ్ లో జరుగుతున్న రెండు రోజుల ఇండియా యూఏఈ భాగస్వామ్య సదస్సుకు సరైన పలువురు పారిశ్రామికవేత్తలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆకట్టుకుంది. సదస్సులో భాగస్వామి రాష్ట్రంగా ప్రత్యేకంగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ఇక్కడ పెట్టుబడుల అవకాశాలపైన ఇచ్చిన ప్రజంటేషన్ పలువురిని ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం తరఫున ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ ప్రజెంటేషన్ను ఇచ్చారు. ఈ సందర్భంగా భారతదేశంలోని అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం కేవలం మూడున్నర సంవత్సరాలు సాధించిన ప్రగతిని వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ప్రవేశ పెట్టిన పారిశ్రామిక విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, ఐటీ, టెక్స్టైల్స్ వంటి 14 రంగాలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఆయా రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న లాండ్ బ్యాంక్, విద్యుత్ వంటి సౌకర్యాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ, టెక్స్టైల్స్ పార్క్, మెడికల్ డివైజస్ పార్కులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పెట్టుబడిదారులకు వివరించారు.తెలంగాణ ప్రభుత్వ సింగిల్ అనుమతుల ప్రక్రియను, పారిశ్రామిక విధానాలను సదస్సుకు హాజరైన పలువురు ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్రం, భారతదేశ పెట్టుబడుల వాతావరణాన్ని పూర్తిగా మారుస్తుందని నమ్మకాన్ని వారు వ్యక్తంచేశారు