తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు చేపడుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉద్యోగ నియామకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 93,739 ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించామని తెలిపారు. ఇప్పటి వరకు 63,025 ఉద్యోగాల భర్తీకి వివిధ నియామక సంస్థలకు అనుమతి ఇచ్చామని చెప్పారు. ఎన్ని అడ్డంకులున్నా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు ఉద్యోగుల చేత వెట్టిచాకిరీ చేయించుకున్నాయని గుర్తు చేశారు. 3 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ యువతకు ఏదో రకమైన ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఉద్యోగ కల్పనకు అందరూ కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని మంత్రి ఉద్ఘాటించారు.
