తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మండలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారన్న జూపల్లి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తండాలు, ఆదివాసీ గూడెంలను గ్రామపంచాయతీలుగా మార్చుతున్నామని తెలిపారు. ప్రజలకు గ్రామీణ పరిపాలన విషయంలో సౌకర్యం కోసం.. కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుపై జిల్లాల నుంచి సమాచారం తెప్పిస్తున్నామని పేర్కొన్నారు. నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడున్న గ్రామపంచాయతీలు 2018, ఆగస్టు 1 వరకు కొనసాగనున్నాయి. రాబోయే ఎన్నికలు కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు తర్వాతే జరుగుతాయన్నారు. సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వచ్చే బడ్జెట్‌లో గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు.
