తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో అద్భుత ఫలితాలు వచ్చాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మిషన్ కాకతీయపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ పథకం వల్ల చెరువులకు జలకళ రావడమే కాకుండా.. పూడికతీతతో భూగర్భ జలాలు కూడా పెరిగాయన్నారు. చెరువులు పునరుజ్జీవం పొందాయన్నారు. మిషన్ కాకతీయతో సత్ఫలితాలు వచ్చాయని నాబార్డు రిపోర్టు ఇచ్చిందన్నారు. మిషన్ కాకతీయ కింద చెరువుల్లో తీసిన 7 కోట్ల ట్రాక్టర్ల మట్టిని రైతులు తమ పొలాల్లో వేసుకున్నారని తెలిపారు. 20 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తీశామన్నారు.
చెరువులను పునరుద్ధరించిన తర్వాత 2016 సంవత్సరంలో 51.5 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. 2013-14లో భూగర్భ జలాలు 6.91 మీటర్లు ఉంటే 2016-17 ఏడాదిలో 9.2 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయన్నారు. అదనపు వరద నీటి వల్ల పంటల దిగుబడి కూడా పెరిగిందన్నారు. 2013-14 ఏడాదితో పోల్చితే 2016-17 ఏడాదిలో 36 నుంచి 39 శాతం చేపల ఉత్పత్తి పెరిగిందన్నారు. దీని వల్ల మత్స్యకారులకు మేలు జరిగిందన్నారు. ఎండిపోయిన బోరు బావుల్లో 17 శాతం నీటి లభ్యత పెరిగిందన్నారు. చెరువుల కింద 24 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. అయితే 2013-14 ఏడాదిలో 10 లక్షల 71 వేల ఎకరాల ఆయకట్టు పండితే.. 2016-17 ఏడాదిలో 15 లక్షల 99 వేల ఎకరాల ఆయకట్టు పండించడం జరిగిందన్నారు.
మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం వల్ల ఏకంగా 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఎక్కువగా పండించడం జరిగిందని తెలిపారు. పూడికమట్టి వల్ల పంటల దిగుబడి పెరిగిందన్నారు. ఎరువులు, రసాయనిక ఎరువుల భారం కూడా తగ్గిందన్నారు. అత్యంత పారదర్శకంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని చెరువులన్నింటినీ పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని మంత్రి హరీష్‌రావు ఉద్ఘాటించారు.