ప్రతి జిల్లా కేంద్రంలో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు . రాష్ట్రంలో అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణా పరిశోధన సంస్థను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. శాసనసభలోప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో చెన్నై తర్వాత సిరిసిల్లలో అతిపెద్ద డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించామని చెప్పారు. క్లీనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువ అవుతున్నందున.. ఈ శిక్షణా కేంద్రాల్లో క్లీనర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రోడ్డుప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వపరంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో చాలా వరకు రోడ్డుప్రమాదాలు తగ్గాయని మంత్రి పేర్కొన్నారు.అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణా పరిశోధన సంస్థ కోసం రూ. 16.48 కోట్లు కేటాయించామని తెలిపారు.
