బీసీలకు హైదరాబాద్‌లో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇవాళ శాసన సభ కమిటీ హాల్లో బీసీ ప్రజా ప్రతినిధుల భేటీ జరిగింది. ఈ భేటీలో మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, బీసీ నేత ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ…సమావేశంలో రాజకీయ, ఉద్యోగ, ప్రైవేటు, విద్యారంగాల్లో బీసీల ప్రాతినిధ్యంపై చర్చించినట్లు చెప్పారు. మరో 119 రెసిడెన్షియల్ పాఠశాలలుండాలని ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. బీసీలకు 2018 నుంచి 62 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీల ఏర్పాటుకు తీర్మానం చేసినట్లు తెలిపారు.స్థానిక సంస్థలు, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించామని..ఈ అంశంపై ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని తీర్మానించినమన్నారు. బీసీలకు హైదరాబాద్‌లో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బీసీ వృత్తిదారులకు ఉత్తమ సాంకేతికత అందించేలా పరిశోధన కేంద్రం దోహదపడుతుందన్నారు. కేంద్ర, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలకు శిక్షణ కేంద్రాల ఏర్పాటుతోపాటు గ్రూప్ 1, ఐఏఎస్, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తామన్నారు.తెలంగాణ కొత్త రాష్ట్రమే అయినా.. అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు.
