గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. నగరంలో నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖతో కలిసి నగరంలోని నిరుపేదలు అధికంగా నివసించే మురికివాడలు, బస్తీలలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తోంది. నగరంలో బస్తీ దవాఖానల ఏర్పాటుపై మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగిoది. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ముఖ్య కార్యదర్శి రాజేష్ తివారి, కుటుంబ, ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, జీహెచ్ఎంసీ అధికారులు హరిచందన తదితరులు పాల్గొన్నారు.
తొలిదశలో నగరంలోని మురికివాడలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్టు మoత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. నగరంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్న ప్రాంతాల్లో కాకుండా వైద్య కేoద్రాలు దూరంగా ఉన్న బస్తీల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో ప్రస్తుతం 145 అర్బన్ హెల్త్ సెంటర్లు వున్నాయని, వీటిని పటిష్ట పరిచేందుకు ఇటీవలనే ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను కూడా భర్తీ చేస్తున్నామని మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడానికి కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం అందుబాటులో ఉన్న 40 జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాళ్లను గుర్తించిందని మేయర్ రామ్మోహన్ తెలిపారు. గ్రేటర్ లో మలేరియా, డెంగీ తదితర వ్యాధులు తరచుగా నమోదయ్యే బస్తీలు, మురికివాడల్లో ఈ బస్తీ దవాఖానల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు.
ఒక్కో బస్తీ దవాఖానలో డాక్టర్, స్టాఫ్ నర్స్, కాంపౌండర్, అటెండర్, మలమూత్ర పరీక్షల విభాగం ఉంటాయి. కనీసం 500 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనంలో ఏర్పాటు కానున్న బస్తీ దవాఖానలకు వెంటనే తగు భవనాలను గుర్తించే ప్రక్రియను జీహెచ్ఎంసీ చేపట్టింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీకి చెందిన 1300 కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. ఈ 1300 కమ్యూనిటీ హాళ్లు స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలు, కొన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. ప్రతిపాదిత బస్తీ దవాఖానలకు ఈ కమ్యూనిటీ హాళ్లను గుర్తించి విద్యుత్, మంచినీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తగు చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఒక్కో బస్తీ దవాఖాన ఏర్పాటుకు ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ 7 లక్షల రూపాయలు అందించనున్నది.
ఢిల్లీలోని నిరుపేదలు ఉండే బస్తీలు, మురికివాడల్లోని నివాసితులకు వైద్య సేవల కోసం ప్రారంభించిన మొహల్లా క్లినిక్‌లను మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి ఇటీవల సందర్శించారు. మొహల్లా క్లినిక్ ద్వారా అక్కడి నగరవాసులకు మెరుగైన ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుతున్నాయని మేయర్ గతంలోనే తెలిపారు. ఈ మొహల్లా క్లినిక్‌లు తక్షణ వైద్య సదుపాయం అందించడంలో సహాయపడుతున్నాయని, హైదరాబాద్ నగరంలోనూ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయనున్నట్టు రామ్మోహన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీటిపై జీహెచ్ఎంసీ, కుటుంబ సంక్షేమ శాఖలు సంయుక్తంగా అధ్యయనం చేశాయి. మొదటి దశలో 50 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.