తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం కేంద్రంగా ఎల్బీస్టేడియం ప్రధాన వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సభకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరయ్యారు. రాష్ట్రపతికి సీఎం కేసీఆర్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేదికపై రాష్ట్రపతి మాటలాడుతూ..
తెలుగులో సోదర.. సోదరీమణుల్లారా.. అని తన ఉపన్యాసాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చానని చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు హాజరైనందుకు సంతోషంగా ఉందన్నారు. తెలుగు భాష అభ్యున్నతికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. దేశ, విదేశాల నుంచి ఈ సభలకు హాజరైన వారందరికీ అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు.
దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా తెలుగు భాష మాట్లాడుతారని రాష్ట్రపతి తెలిపారు. ప్రపంచంలోనే తెలుగు భాష గొప్పదని రాష్ట్రపతి కొనియాడారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని ఆయన తెలిపారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పేర్కొన్నారు.తెలుగు భాషాభివృద్ధికి గురజాడ అప్పారావు విశేష కృషి చేశారని గుర్తు చేశారు. తెలుగు భాషా వ్యాప్తికి శ్రీకృష్ణదేవరాయలు ఎనలేని కృషి చేశారని తెలిపారు. తన కంటే ముందు ముగ్గురు తెలుగువారు రాష్ర్టపతులయ్యారు. తెలుగు తెలిసిన రాష్ట్రపతుల్లో సర్వేపల్లి, వివి గిరి, సంజీవరెడ్డి ఉన్నారని చెప్పారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా తెలుగువారే అని రాష్ట్రపతి పేర్కొన్నారు. హైదరాబాద్ అంటే బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు అని కోవింద్ వ్యాఖ్యానించారు.