తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగుతోంది.. ఒక్కో ప్రాజెక్టును వరుసగా పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికలు వేస్తోంది. ఈ క్రమంలో మరో ముందడుగు పడింది. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలకు రాష్ర్ట వన్య ప్రాణి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ర్ట వణ్య ప్రాణి బోర్డు గవర్నింగ్ బాడీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ర్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, బోర్డు సభ్యులైన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రాథోడ్ బాబురావు, కోరం కనకయ్య, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా, పలువురు ఉన్నతాధికారులు, పలువురు ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలోని సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, పాత నల్లగొండ జిల్లా నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు రాష్ర్ట వన్య ప్రాణి బోర్డు అనుమతించింది. ఈ ప్రతిపాదనలు కేంద్ర వన్యప్రాణి మండలికి అనుమతి కోసం నివేదించింది. పాత ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ నియోజకవర్గం సిర్పూర్ టీ మండలంలోని రెండు బ్రిడ్జిల నిర్మాణాలకు రాష్ర్ట వన్య ప్రాణి బోర్డు అనుమతించింది. చింతల్‌కుంట నుంచి భూపాలపట్నం మధ్య నిర్మించనున్న ఈ రెండు బ్రిడ్జీల నిర్మాణాలకు రాష్ర్ట స్థాయిలోనే అనుమతి సరిపోతుంది. పాత ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా పరిధిలో సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 6.75 లక్షల ఎకరాల్లో సాగునీటిని అందించేందుకు రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కిన్నెరసాని అభయారణ్యం ఎకో జోన్ నుంచి 442 హెక్టార్ల అటవీ ప్రాంతానికి వన్య ప్రాణి మండలి అనుమతి తప్పనిసరిగా మారింది. దీంతో రాష్ర్ట స్థాయి వన్య ప్రాణి బోర్డులో అనుమతినిస్తూ.. తుది అనుమతి కోసం కేంద్ర వన్య ప్రాణి మండలికి ప్రతిపాదించారు.
సీతారామా ప్రాజెక్టు పరిధిలో వన్య ప్రాణి సంరక్షణ కోసం రూ. 2.41 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించిన తరువాత వన్య ప్రాణులు తిరిగేందుకు 12 అండర్ పాసెస్ లను ప్రతిపాదిస్తున్నారు. ఎకో బ్రిడ్జీల నిర్మాణాలు చేపట్టనున్నారు. గడ్డ పెంపకం, సాసర్‌పిట్‌లు నిర్మించి వన్య ప్రాణులకు నీటి వసతి కల్పించడం వంటి చర్యలు చేపట్టనున్నారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు వన్య ప్రాణి బోర్డు సభ్యులను ఈ నెలాఖరులో పర్యటనకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆహ్వానించారు. నెల్లికల్ ఎత్తి పోతల పథకాన్ని 3.13 హెక్టార్ల వన్య ప్రాణి అటవీ ప్రాంతాన్ని అనుమతించేందుకు బోర్డులో నిర్ణయం తీసుకున్నారు.