మనం సైతం సేవా కార్యక్రమానికి తను సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తానని “టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, టీన్యూస్ ఎండీ జోగినపల్లి సంతోష్‌కుమార్” భరోసా ఇచ్చారు. మాటల్లో కాకుండా చేతల్లో ఈ కార్యక్రమ ఉన్నతికి తోడ్పాటునందిస్తానని ప్రకటించారు. చలనచిత్ర పరిశ్రమలోని 24 విభాగాల కార్మికులతోపాటు కష్టాల్లో ఉన్న సామాన్యులకు తోడ్పాటునందించే ఉద్దేశంతో సినీనటుడు కాదంబరి కిరణ్ బృందం మనం సైతం పేరుతో ఓ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అనారోగ్యంతోపాటు వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధిత కుటుంబాలకు మనం సైతం ఆదివారం హైదరాబాద్‌లో ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంతోష్‌కుమార్, సినీ నటులు రాజేంద్రప్రసాద్, అల్లరి నరేశ్‌తో కలిసి బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు.
మనం సైతం కార్యక్రమానికి తనవంతుగా సంతోష్‌కుమార్ రెండు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికీ ఇబ్బంది కలుగకుండా బాధల్లో ఉన్నవారి మోముల్లో నవ్వులు పూయించాలని చెప్పారు. రాజేంద్రప్రసాద్, అల్లరి నరేశ్.. రెండుతరాల నటుల నవ్వుల సాక్షిగా ఈ మాట చెబుతున్నానని అన్నారు. నేను అందిస్తున్న చేయూతపై ఓ పుస్తకమే రాయొచ్చని కాదంబరి కిరణ్ అన్నారు. ఆయన నాపై చూపిస్తున్న ప్రేమకు అది నిదర్శనం. మనం సైతంలో తనకు ఓ పేజీ ఉండాలని కోరుకుంటున్నా అని సంతోష్‌కుమార్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు సినీనటులు, మనం సైతం సభ్యులు పాల్గొన్నారు.