దేశానికే ఆదర్శంగా తెలంగాణలోని స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య కార్యకలాపాలు నిర్వహిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికే లాభాల్లో వాటా ఇచ్చే స్థాయికి ఎదగడం అభినందనీయం అని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృధ్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో స్త్రీ నిధి బ్యాంక్ నాలుగవ సర్వ సభ్య సమావేశం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 9 ఎజెండా అంశాలను స్త్రీ నిధి అధ్యక్షురాలు అనిత ప్రవేశపెట్టారు. వీటిని సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా అంగీకరించిది.
అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. మహిళల కోసం, మహిళల చేత నిర్వహించబడుతున్న స్త్రీ నిధి సహకార పరపతి సమాఖ్య దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, ఇతర రాష్ట్రాలు సైతం ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేసేందుకు జాతీయ సహాయక సంస్థగా స్త్రీ నిధి గుర్తించడం గర్వకారణం అన్నారు. ఆరేళ్లలోనే 17వేల 122 గ్రామ సమాఖ్యల్లో 2 లక్షల 86వేల మహిళా సంఘాల్లో 18 లక్షల మంది సభ్యులుగా ఉండడం గర్వకారణమన్నారు. గత సంవత్సరం 11 వందల 49 కోట్ల రుణవితరణ జరగగా.. ఈ సంవత్సరం 18 శాతం అధికంగా 13 వందల 53 కోట్లు రుణ వితరణ చేయడాన్ని ప్రశంసించారు. మొత్తం మీద ఇప్పటివరకు 4వేల8వందల కోట్ల రుణవితరణతో మహిళాసంఘాలకు ఆర్ధిక స్వావలంబన కల్పిస్తున్న స్త్రీ నిధి… రానున్న రోజుల్లో మరింత పురోగతి సాధించాలని మంత్రి జూపల్లి ఆకాంక్షించారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, టీ ఎస్ ఐపాస్ లాగా స్త్రీ నిధి కూడా దేశంలోని ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తోంది, ఇతర రాష్ట్రాలకు మన మహిళ సంఘాల సభ్యులు వెళ్లి శిక్షణ ఇచ్చి రావడం తెలంగాణకే గర్వకారణమని మంత్రి కొనియాడారు. ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే విషయంలో మెళకువలు తెలుసుకుంటే ఉన్న ఊరిలోనే మెరుగైన ఉపాధి పొందవచ్చని, ఆ దిశగా మహిళాసంఘాలను చైతన్యం చేయాలన్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఐకియా, అమెజాన్ లాంటి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, వీటిల్లో పనిచేసేందుకు ప్రభుత్వమే నైపుణ్య శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఆదాయం పెంచుకోవడం తో పాటు, ఖర్చుల నియంత్రణ పై కూడా మహిళాసంఘాలు దృష్టి సారించాలని అన్నారు.
సీఎం కేసీఆర్ గారు చేసిన 14 ఏళ్ల పోరాటం, మనందరి సంఘటిత శక్తి వల్లే తెలంగాణ సాధించుకోగలిగామని, అలాగే మహిళాసంఘాలు సంఘటితం అయితే సాధ్యంకానిది ఏదీ లేదని మంత్రి జూపల్లి అన్నారు. ప్రభుత్వం నుంచి గ్రామాలకు వస్తున్న నిధుల్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా మహిళాసంఘాలు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. 70 ఏళ్లలో జరుగని ఎన్నో అభివృధ్ది కార్యక్రమాలను మూడేళ్ళలోనే చేపట్టామని, బంగారు తెలంగాణ సాధనలోను మహిళాసంఘాలు కీలకపాత్ర పోషించాలన్నారు. ప్రభుత్వ పథకాలన్నింటిని సద్వినియోగం చేసుకుంటే ఎవరూ అప్పు చేయాల్సిన అవసరమే ఉండదన్నారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని తేబోతున్నామని, పంచాయతీలకు నిధులతో పాటు విధులను కూడా అప్పగిస్తామన్నారు. 100 శాతం బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు మహిళా సంఘాలు కృషి చేయాలని కోరారు. తెలంగాణ మహిళ సంఘాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని, రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా ముందుకు పోవాలన్నారు.