తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నం కొనసాగిస్తోంది. తాజాగా కేంద్ర గిరిజన శాఖ మంత్రి జ్యూవల్ ఓరమ్ ను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. మంత్రి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, ఎంపీలు సీతారాం నాయక్, నగేశ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేంద్రమంత్రి ఓరమ్ ను ఢిల్లీలో కలిశారు.
మేడారం జాతరకు గిరిజన కుంభమేళాగా పేరు ఉందని, ఇప్పటికే మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరకు జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా ల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తారని చెప్పారు. గత జాతరకు 90 లక్షల మంది తరలివచ్చారని, సంవత్సరం కోటి మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
ఉత్తర భారతదేశంలో జాతీయ గిరిజన వనజ్ ఉత్సవ్ పేరుతో కేంద్రం పండుగ నిర్వహిస్తోందని, అలాగే తెలంగాణలో జరిగే మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం జాతర నిర్వహణ, ఏర్పాట్ల కోసం రూ.160 కోట్లను మంజూరు చేసిందని, ఈ సంవత్సరం రూ.80 కోట్లు ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 3 వరకు జరిగే జాతరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ నెల 18 న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్ ఆధ్వర్యంలో మేడారం ఏర్పాట్లను పరిశీలించనున్నామని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.