కార్మికుల సంక్షేమం కోసం పాటుపడని కంపెనీపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీ(బిల్ట్-బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) కార్మికుల పట్ల కంపెనీ యాజమాన్యం నిర్లక్ష ధోరణిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంమంత్రి, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ మూతపడడం వల్ల పనిలేకుండా రోడ్డున పడిన దాదాపు 750 మంది కార్మికులకు ఈ నెల 9వ తేదీలోపు సంక్రాంతి పండగ కోసం కనీసం ఒక నెల జీతం చెల్లించాలని కంపెనీ ప్రతినిధికి డెడ్ లైన్ విధించారు. 9వ తేదీన నెల జీతం కార్మికులకు ఇచ్చి, ఈ నెల 10వ తేదీన కంపెనీ సీఈవో సచివాలయంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు.
ఫ్యాక్టరీ మూతపడి రెండేళ్లు గడుస్తున్నా కార్మికుల సమస్యలను తీర్చడం లేదని రేయాన్స్ ఫ్యాక్టరీ యూనియన్ల జేఏసీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, చందూలాల్ ను ఆశ్రయించడంతో వీరి ముగ్గురు ఆధ్వర్యంలో నేడు సచివాలయంలో యూనియన్ల నాయకులు, కంపెనీ ప్రతినిధులతో సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫ్యాక్టరీ యాజమాన్య ధోరణిని మంత్రులకు యూనియన్ ప్రతినిధులు వివరించారు. 32 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, వేతనాలు ఇవ్వమని అడిగితే డెడ్ లైన్లు పెడుతున్నారు తప్ప ముందుకు రావడం లేదని గోడు వెల్లబుచ్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రులు ఈ నెల 9వ తేదీలోపు నెల జీతం ఇచ్చి, మిగిలిన జీతం ఎప్పుడు ఇస్తారో స్పష్టమైన హామీ ఇచ్చేందుకు 10వ తేదీన జరిగే సమావేశానికి రావాలన్నారు. ఈ రెండింటిలో దేనిలో ఫెయిల్ అయినా తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు.
రేయాన్స్ ఫ్యాక్టరీ మూతపడకూడదు, కార్మికులు ఇబ్బంది పడకూడదని మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి కేసిఆర్ వద్ద జరిగిన సమావేశంలో కంపెనీ యాజమన్యం అడిగిన ప్రతి డిమాండ్ ను సిఎం కేసిఆర్ అంగీకరించారన్నారు. సిఎం వద్ద జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసిఆర్ సానుకూలంగా అన్నింటికి అంగీకరించినందుకు చాలా ఆనందంగా ఉందని, త్వరలోనే కంపెనీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు దానిని పట్టించుకోకపోవడం సీరియస్ గా పరిగణిస్తున్నామన్నారు. రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చినా కంపెనీ యాజమాన్యం ఫ్యాక్టరీ ప్రారంభించకపోగా.. 32 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం మంచిది కాదన్నారు. వీరి తీరు మారకపోతే చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు ఏకకాలంలో చేపట్టాల్సి వస్తుందన్నారు.