తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కసరత్తుపై దృష్టి సారించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2018-19 వార్షిక బడ్జెట్ రూపకల్పనకు ఆర్థికశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను, ప్రస్తుత సంవత్సరం కేటాయించిన నిధులలో ఇప్పటివరకు ఎంత ఖర్చయింది? ఇంకా ఎన్నినిధులు అవసరం? అనే విషయంపై ప్రభుత్వశాఖలు నివేదిక తయారుచేస్తున్నాయి. ఈ నెల 9వ తేదీలోగా అన్నిశాఖలు బడ్జెట్ ప్రతిపాదనలను పంపాలని ఆర్థికశాఖ ఆదేశాలు జారీచేసింది. కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి మొదటివారంలోనే ప్రవేశపెట్టనున్నందున.. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనను త్వరగా పూర్తిచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి కేటాయింపులు పెంచటంతోపాటు.. రైతులకు ఏడాదికి ఎకరాకు 8 వేల రూపాయల చొప్పున పంటల పెట్టుబడి పథకానికి కూడా కేటాయింపులు చేయనున్నారు.
గతంలో ఆర్థిక సంవత్సరం మొదలైన మొదటి ఆరునెలల వరకు బడ్జెట్ కేటాయింపుల్లో కనీసం 10 శాతం నిధులు కూడా ఖర్చు చేయడంలో అధికారులు విఫలమయ్యేవారు. కానీ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించడంతో ఏ ప్రాంతంలో ఎక్కడ.. ఎవరికి.. ఎంత నిధులను ఖర్చు చేశామనే విషయంపై అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. నిధులు సద్వినియోగమయ్యేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఫలితంగా ఈసారి మొదటి ఆరునెలల్లోనే నిర్ణీత పరిమితిని మించి నిధులను ఖర్చుచేశారు. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు లేకుండా ప్రగతిపద్దు, నిర్వహణపద్దు పేరుతో కొత్త తరహాలో 2018-19 బడ్జెట్ రెడీ అవుతోంది.
రైతు రుణమాఫీ పూర్తికావడంతో ప్రభుత్వం రైతులకు పంటల పెట్టుబడిని ఇవ్వనుంది. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు లేకుండా ప్రగతిపద్దు, నిర్వహణపద్దు పేరుతో కొత్త తరహాలో 2017-18 బడ్జెట్‌ను రూపొందించింది. సంక్షేమంతోపాటు మానవీయ కోణాన్ని జోడించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గత బడ్జెట్ పెద్దపీట వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం 1,49,646 కోట్లుగా ప్రతిపాదించింది. ఇందులో ప్రగతిపద్దు 88 వేల కోట్లు కాగా.. నిర్వహణ వ్యయం కింద 61 వేల కోట్లను ప్రతిపాదించారు. వచ్చే బడ్జెట్‌లో కూడా ప్రగతిపద్దు సైజు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే బడ్జెట్‌లోని ప్రగతి పద్దులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసే అవకాశముంది. బీసీల సంక్షేమానికి ఈ ఏడాది 5,071కోట్ల రూపాయలు కేటాయించింది. వచ్చే వార్షిక బడ్జెట్‌లో దీనిని భారీగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీసీ సబ్‌ప్లాన్‌పై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం నిధులను వెంటవెంటనే ఖర్చుచేస్తున్నారు. పైసా పైసాకు పక్కాగా లెక్క చెప్తున్నారు. బడ్జెట్‌లో కేటాయించిన దానికంటే ఎక్కువ నిధులను వెచ్చిస్తున్నారు.