తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పంట పెట్టుబడి పథకాన్ని మే 15 నుంచి అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఇవాళ ఉదయం పంట పెట్టుబడి పథకంపై మంత్రి పోచారం అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై.. పథకం అమలు కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. ఈ సమావేశంలో మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ.. 2018 వాన కాలం నుంచి ఎకరానికి రూ. 4 వేల పెట్టుబడి చొప్పున ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేబినెట్ మంత్రులంతా త్వరలోనే రైతులకు వద్దకు వెళ్లి ఈ పథకంపై చర్చిస్తారని తెలిపారు.
