ఐటీలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది. ఐటీ రంగ అభివృద్ధి, నూతన అవకాశాలు ఒడిసిపట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసకువస్తున్న విధానాలతో…తెలంగాణలో తమ కంపెనీలను నెలకొల్పేందుకు ఐటీ దిగ్గజాలు క్యూ కడుతున్నాయి. 2020 నాటికి ఐటి ఎగుమతులు రూ.1.20 లక్షల కోట్లకు చేరుకోవాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఐటి విధానానికి విశేష స్పందన లభిస్తోంది. దేశంలోని ఐటీ రంగం ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 11 శాతంగా నిలిచింది. 2016-17 సంవత్సరంలో తెలంగాణ నుంచి ఐటి ఉత్పత్తులు రూ.85,740 కోట్లు దాటింది. 2017-18లో లక్ష కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. వృద్ధిరేటు 14 శాతానికి చేరింది. టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టీసీఎస్, లాంటి దేశీయ సంస్థలతోపాటు అంతర్జాతీయ ఐటి కంపెనీలు గూగుల్, సీఏ టెక్నాలజీస్, అమెజాన్, యాపిల్, ఐబీఎం తదితర సంస్థలు ఇక్కడి నుంచి తమ కార్యకలాపాలను విస్తృతం చేశాయి.
ఐటీ సెక్టార్‌లో తెలంగాణను నంబర్ వన్‌గా అవతరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఈ పాలసీని ప్రవేశపెడుతూ అసెంబ్లీలో మంత్రి కేటీరామారావు ప్రకటించిన విషయం విదితమే. రాష్ట్రప్రభుత్వం ఐటి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎక్స్‌పోర్టు ఒరియెంటెడ్ యూనిట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కుని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2016-17 సంవత్సరంలో 24,506 మంది ఉద్యోగాలు లభించాయి. దీంతో హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య 4.31 లక్షలకు చేరింది. రాష్ట్రప్రభుత్వం 2020 నాటికి ఐటీ రంగంలో ఇక్కడ ఎనిమిది లక్షల మందికి కల్పించాలని, పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా ప్రణాళికను ఖరారు చేసింది.
రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో దీంతో అమెజాన్ కంపెనీ ఒక్క హైదరాబాద్‌లోనే ఐదు సెంటర్లను ఏర్పాటు చేసింది. మ్యాప్ డెవలప్‌సెంటర్, సేల్స్‌ఫోర్స్ కోసం సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ విభాగంలో తమ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యాపిల్ నిర్ణయింది. ఊబర్, డీబీఎస్, వాల్యూ ల్యాబ్స్, ఫ్లైదుబాయ్, మరో అనేక ఐటీ దిగ్గజాలు హైదరాబాద్‌లో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన టీఫైబర్ ప్రాజెక్టు 2018 నాటికి పూర్తవుతుండగా ఇందులో భాగస్వామ్యం కోసం ఇప్పటికే అనేక సంస్థలు ముందుకు వచ్చాయి.