విదేశాల్లో ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషిచేస్తున్నదని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన భారత సంతతి పౌరుల సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల సమస్యల పరిష్కరించేందుకు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ అన్నీ రాష్ట్రాల మంత్రులతో చర్చించారని వివరించారు. ఒకసారి విదేశాల్లో చిక్కుకుని తిరిగి వచ్చి మళ్ళీ వెళ్లి చిక్కుకున్న వారిని తీసుకొచ్చి పాస్ పోర్ట్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, ఇమ్మిగ్రేషన్ విషయాల్లో ముందుందని కేద్ర మంత్రి ప్రశంసించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో త్వరలో విదేశ్ భవన్‌కు స్థలం కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఏడు మధ్య ప్రాచ్య దేశాల్లో నలుగురు చొప్పున తెలుగు మాట్లాడే అధికారులను నియమించాలని కోరామన్నారు. నకిలీ పాస్‌పోర్ట్ ఏజెంట్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.