గత ఎడాదిలో జరిగిన టీ20 మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు సెలెక్ట్ అయిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఆయన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ కావడంపై ఫిర్యాదు చేశారు. సిరాజ్ యువ క్రికెటర్ కావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఫేస్‌బుక్‌లోనూ పెద్ద సంఖ్యలోనే ఫ్రెండ్స్ ఫాలోయింగ్ ఉంది. వీరిలో ఓ 14 ఏళ్ల బాలుడు సైతం సిరాజ్‌కు ఫేస్బుక్ ఫ్రెండ్‌గా ఉన్నాడు. ఆ బాలుడు క్రికెటర్ కుటుంబీకులకు పరిచయస్తుడు కావడంతో తేలిగ్గా సిరాజ్ ఫేస్బుక్ పాస్వర్డ్ తెలుసుకున్నాడు. ఆయన అనుమతి లేకుండా ఖాతాలోకి ప్రవేశించిన బాలుడు దాని నుంచి ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న కొందరికి సందేశాలు పంపాడు. ఈ విషయం గుర్తించిన సిరాజ్ తన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయిందంటూ మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని గంటల్లోనే బాలుడే హ్యాకర్ అని గుర్తించిన అధికారులు విషయం సిరాజ్‌కు వివరించారు. అతడు తన కుటుంబీకులకు పరిచయస్తుడు కావడంతో కేసు వద్దని పోలీసులకు చెప్పిన సిరాజ్ తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు.
