విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు మరింత మెరుగైన రవాణ వ్యవస్థను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా సిద్ధమవుతోంది.
నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న మహానగరవాసుల కష్టాలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కారించేందుకు…ఇప్పటికే పలు ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన మెట్రోరైలును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవటం కోసం శరవేగంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు రెండో దశపై కూడా ప్రభుత్వం ముందుగానే దృష్టి సారించింది.
ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్‌పేట, అమీర్‌పేట నుంచి మియాపూర్ వరకు 30కిలోమీటర్ల మేర మెట్రో రైల్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్ కల్లా అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ వరకు, అలాగే ఈ సంవత్సరం చివరి కల్లా అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు, సికిందరాబాద్ జేబీఎస్ నుంచి గౌలీగూడ సీబీఎస్ వరకు మెట్రోరైలును అందుబాటులోకి తెచ్చే దిశగా పనులను వేగవంతం చేశారు. ఇదే ఉత్సాహంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మెట్రోరైలు రెండో దశ డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) రూపకల్పనకు కసరత్త మొదలైంది. ఇందుకు గాను ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌కు చెందిన నిపుణులు నగరానికి చేరుకున్నారు. రెండో దశగా ప్రతిపాదించిన వివిధ ప్రాంతాల్లో పర్యటించిన నిపుణుల బృందం బేగంపేటలోని మెట్రోరైలు భవన్‌లో రెండురోజుల పాటు మేధోమథనం నిర్వహించి, పలు అంశాలపై కూలంకుశంగా చర్చించినట్లు హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ డా.ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
మెట్రోరైలు రెండో దశ డీపీఆర్‌ను నగరంలోని ట్రాఫిక్‌కు తగిన విధంగా రవాణా వ్యవస్థ అందుబాటులోకి తెచ్చే అంశంతో పాటు గూగుల్ మ్యాప్ ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా గుర్తించే అంశాన్ని పరిగణలోకి తీసుకుని డీపీఆర్‌ను తయారు చేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ తెలిపారు.
అలాగే ప్రయాణికులను పెంచుకునే అధ్యయనం, మెట్రో మొదటి దశ, ఎంఎంటీఎస్, ఆర్టీసి బస్సుల రాకపోకల అనుసంధానం, పాదచారులు మెట్రో స్టేషన్‌కు చేరుకునేలా ఫీడర్ బస్సు సర్వీసుల నిర్వాహణ వంటి అంశాలున్నట్లు తెలిపారు. దీంతో పాటు స్థల సేకరణ, క్షేత్ర స్థాయిలో టోపో షీటర్ తయారు చేసేందుకు కావల్సిన ఫీల్డు సర్వేయర్లు, డిపోలు, ఎలక్ట్రికల్ వ్యవస్థ ఏర్పాటు, రూట్ ఆలైన్‌మెంట్, రెండో దశ కింద స్టేషన్లు నిర్మించే ప్రాంతాల ఎంపిక వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని డీపీఆర్‌ను తయారు చేసే అంశంపై డీఎంఆర్‌సీ నిపుణులతో మేధోమథనం నిర్వహించినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు