‘తలాపున పారుతుంది గోదారి.మన చేను,మన చెలక ఎడారి”అని గతంలో తెలంగాణా అవతరణకు ముందు పాడుకునే వాళ్ళమని ఇప్పుడు ‘ తలాపున పారుతుంది గోదారి. మన చేను , మన చేలుక మాగాణి”అని పాడుకోవలసిన రోజులు వచ్చాయని మంత్రి హరీశ్ రావు అన్నారు.
సాగునీటి రంగంలో నాణ్యత విషయంలో రాజీ పడరాదని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు కోరారు.ఆదివారం జలసౌధలో ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్,సి.డి.ఒ ఇంజనీర్లతో మేధోమథనం జరిపారు.పలువురు ఇంజనీర్లు చేసిన సూచనలపై మంత్రి సానుకూలంగా స్పందించారు.ఆ సూచనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.ఇకపై ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం పనితీరుపై ఇ.ఎన్.సి.అడ్మిన్ నాగేందర్ రావుకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్టు మంత్రి తెలిపారు.తెలంగాణ అంతటా ఇరిగేషన్ రంగంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు దాదాపు 40 కి పైగా నిర్మాణంలో ఉనాయని రాబోయే ఏడాది కాలం క్వాలిటీ కంట్రోల్ విభాగానికి అత్యంత కీలకమని మంత్రి అన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కాలంతో పోటీ పడుతున్నామని,అయితే అదే సందర్భంలో ఎట్టిపరిస్థితులలోనూ నాణ్యత పై రాజీ కుదరదని స్పష్టం చేశారు.
మంచిగా, నిజాయితీగా , 16 గంటల పాటు పనిచేసే సిబ్బందిని ప్రోత్సహించాలని ఆదేశించారు.వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు.తెలంగాణలో సాగునీటిరంగంలో కనీ వినీ ఎరుగని రీతిలో జరుగుతున్న పనుల వల్ల క్వాలిటీ కంట్రోల్ విభాగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు.భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకుంటూ ఆకుపచ్చని, రైతుల ఆత్మహత్యలు లేని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతున్నందుకు ఇరిగేషన్ శాఖకు చెందిన అన్ని స్తాయిలలోని ఇంజనీర్లు గర్వపడాలని మంత్రి హరీశ్ రావు అభిప్రాయ పడ్డారు.తెలంగాణా రాష్ట్రం నీళ్ళు, నిధులు, నియామకాల లక్ష్యంతో ఏర్పడిందని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడగానే ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు చూపుతో సాగునీటి రంగ అభివృద్దికి మూడంచెల వ్యూహం అనుసరిస్తున్నట్టు హరీశ్ రావు తెలియజేశారు. గత ప్రభుత్వాలు ప్రారంభించి అనేక సమస్యల కారణంగా గాలికి వదిలేసిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి నిర్దేశిత ఆయకట్టుకు నీరందించడం. కొన్ని ప్రాజెక్టుల్లో తెలంగాణా అవసరాలకు , ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా రీ ఇంజనీరింగ్ చేసుకోవడం, గత ప్రభుత్వాలు మంజూరు చేసి అమలు చేయకుండా అటకెక్కించిన ప్రాజెక్టులను సత్వరమే పూర్తీ చేయడం, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా శిథిలమైపోయిన పాత సాగునీటి వ్యవస్థలను ఆధునికీకరించడం , చిన్ననీటి వనరులను పునరుద్దరించుకొని గ్యాప్ ఆయకట్టుని సాగులోనికి తీసుకరావడం వంటి బృహత్తర లక్ష్యాలతో పనులు జరుగుతున్నట్టు మంత్రి చెప్పారు.ఈ వ్యూహంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సాగు నీటి ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి కావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. బడ్జెట్ లో నిధుల కేటాయింపులు పెంచిందన్నారు.
సాగునీటి శాఖను ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా పునర్ వ్యవస్తీకరించినట్టు మంత్రి పేర్కొన్నారు. గత కాంగ్రస్ హయాంలో ఇ.పి.సి. విధానం వల్ల సాగునీటి శాఖ నిర్వీర్యం అయ్యిందన్నారు.సర్వే , ఇన్వెస్టిగేషన్ , డిజైన్ , ఎస్టిమేట్స్ అన్నీ కూడా గతంలో ఎజేన్సీలే చేసేవారన్నారు. నాణ్యతా ప్రమాణాల తనిఖీ కూడా థర్డ్ పార్టీకి అప్పగించారని అన్నారు. మన ఇంజనీర్ల సామర్థ్యాన్ని నిర్వీర్యం చేశారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇ.పి.సి. విధానాన్ని రద్దు చేసి నీటిపారుదల శాఖను బలోపేతం చేసిందన్నారు.సాగునీటి శాఖలో ఇంజనీర్ల భాద్యతలను పునరుద్దరించినట్టు మంత్రి చెప్పారు. బాధ్యతతో పాటు ఇరిగేషాన్ ఇంజనీర్ల లో జవాబుదారి తనం పెరిగిందన్నారు. వేల కోట్ల రూపాయల పనులు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జరుగుతున్నవని హరీశ్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, సుందిళ్ళ , అన్నారం బ్యారేజిలు , వాటి పంపు హౌజ్ లు , సర్జ్ పూల్స్, టన్నెల్ల తవ్వకం , లైనింగ్ తదితర జరుగుతున్న పనులను చూసి దేశమంతా అబ్బురపడుతున్నదని హరీశ్ రావు అన్నారు. రోజుకు ఒక లక్ష క్యూబిక్ మీటర్ల మట్టి పని , 20 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరుగుతున్నట్టు ఆయన వివరించారు. రోజుకు 2 లక్షల సంచుల సిమెంట్ వినియోగం అవుతున్నదన్నారు. మరో వైపు పాలమూరు రంగారెడ్డి , డిండి, చనకా కొరట , తుపాకుల గూడెం , సదర్మాట్ బ్యారేజీల నిర్మాణం , వందలాది భారీ స్ట్రక్చర్ల నిర్మాణం జరుగుతున్నట్టు తెలియజేశారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణలో అన్ని విభాగాల ఇంజనీర్లు అద్భుతంగా పని చేస్తున్నారని అభినందించారు. పనులు పర్యవేక్షించే ఫీల్డ్ ఇంజనీర్లతో పాటు, పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించే క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ల పాత్ర, ప్రాజెక్టుల డిజైన్లను రూపొందించే డిజైన్ ఇంజనీర్ల పాత్ర కీలకమైనదని ఇరిగేషన్ మంత్రి స్పష్టం చేశారు.
ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడంతో పాటు నాణ్యత పై రాజీ లేకుండా నిర్మించవలసిన భాధ్యత ఉన్నదన్నారు. పది కాలాల పాటు ప్రాజెక్టులు ప్రజలకు సేవలు అందించాలన్నారు. వెయ్యి సంవత్సరాల కిందట కాకతీయులు నిర్మించిన చెరువులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కాకతీయుల నాటి కాలంలో ప్రదర్శించిన అద్భుతమైన నిర్మాణ నైపుణ్యం , నాణ్యత , నిర్మాణానికి ఎంపిక చేసిన బిల్డింగ్ మెటీరియల్,ఎక్కడా రాజీ లేకుండా నిర్మించారని హరీశ్ రావు చెప్పారు. అందుకే అవి ఇప్పటికీ మనకు సేవలు అందిస్తున్నాయన్నారు. మనం కూడా కాకతీయుల వారసత్వాన్ని అంది పుచ్చుకోవాలన్నారు. తెలంగాణలో ఇప్పుడు నిర్మాణం అవుతున్న భారీ నిర్మాణాలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. అవి గొప్ప మాన్యుమెంట్స్ గా చరిత్రలో నిలిచేందుకు క్వాలిటి కంట్రోల్ ఇంజనీర్లు, డిజైన్ ఇంజనీర్ల పాత్ర కీలకమైనదన్నారు.నిర్మాణానికి ముందు వాడే ఇసుక, స్టీల్, సిమెంట్ నాణ్యతకు క్వాలిటీ కంట్రోల్ విభాగానిదే బాధ్యత అన్నారు. డిజైన్ ప్రకారం కొలతలు , స్లోప్స్ ,లెవెల్స్ సరిగా ఉన్నాయా లేదా అని చూసే భాద్యత ఈ విభాగంపైనే ఉందన్నారు. నిర్మాణం తర్వాత నాణ్యమైన సిమెంట్ కాంక్రీట్ పడిందా లేదా, మట్టి 98 % సాంద్రతను పొందిందా లేదా, కొలతలు డిజైన్ ప్రకారం ఉన్నాయా లేదా, సరి అయిన లెవెల్ కి చేరిందా లేదా వంటి అంశాలను క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు సరి చూడాలని మంత్రి కోరారు.
ప్రతి రోజూ క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది సైట్స్ కి వెళ్లి తనిఖీ చేయాలని కోరారు. భారీ కాంక్రీట్ పనులు జరుగుతున్న సైటుకు ఎక్కువ సార్లు వెళ్ళాలని కోరారు.ఎప్పటికకప్పుడు సైట్లో ఉండే ప్లేస్ మెంట్ రిజిస్టర్ లో తప్పనిసరిగా రికార్డు చేయాలని కోరారు. తమ తనిఖీలో కనుగొన్న అంశాలపై అధికారులకు, ఫీల్డ్ అధికారులకు రిపోర్టు చేయాలని మంత్రి ఆదేశించారు. బిల్లులు చెల్లించే ముందు తప్పనిసరిగా సైట్ కి వెళ్ళాలని, కొలతలు, నాణ్యత పరిశీలించాలన్నారు.క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు సంతృప్తి చెందిన తర్వాతే సర్టిఫికెట్లు జారీ చెయ్యాలని ఆదేశించారు. ఒక్క రూపాయి కూడా ప్రజా ధనం వృధా కాకుండా చూడాలని కోరారు. వివిధ సందర్భాల్లో పత్రిక లలో కానీ, ఇతరత్రా కానీ వచ్చే ఫిర్యాదులపై మంత్రి పేషీ స్పందించి క్వాలిటీ కంట్రోల్ విభాగానికి పంపే సమాచారంపై నిస్పక్షపాతంగా విచారణ జరిపి నివేదికలు ఇవ్వాలని హరీశ్ రావు కోరారు.ఈ సమావేశంలో ఇరిగేషన్ ఇ.ఎన్.సి. మురళీధరరావు, నాగేందర్ రావు, సి.ఇ.లు సునీల్, హరిరాం,ఖగేందర్ రావు,సురేష్, శ్యాం సుందర్, మధుసూదనరావు, తదితరులు పాల్గొన్నారు.