తెలంగాణ రాష్ట్రంలో మూడు చోట్ల సర్పంచ్ ల సమ్మేళనాలు నిర్వహించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర్రంలోని ప్రతి జిల్లా నుండి 100 మంది సర్పంచ్ లను ఈ సమ్మేళనానికి ఆహ్వనిస్తున్నారు. వీరికి జిల్లాలో ఉత్తమ పంచాయతీలుగా గుర్తింపు పొందిన గ్రామ సర్పంచ్ లతో తమ అనుభవాలను పంచుకొనే విధంగా సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం, వందశాతం పన్నుల వసూలు, ఎల్ఈడీ లైట్ల వినియోగం, నీటి సంరక్షణ, ఉపాధిహామీ లాంటి కార్యక్రమాల్లో తాము ఎలా ముందుకువెళ్లింది వివరించి, ఇతర సర్పంచ్ లను ఆ దిశగా సన్నద్ధం చేసేలా టీసీపార్డ్ సర్పంచ్ ల సమ్మేళనానికి ఏర్పాటు చేస్తోంది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యే ఈ సమ్మేళనాల్లో ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.
