కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ డిమాండ్లను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. విద్యా సంస్థల యాజమాన్యాలుగా సామాజిక బాధ్యతతో విద్యార్థులను ఆందోళనకు గురి చేయకుండా పరీక్షలకు పూర్తిగా సహకరించాలని కోరారు. కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ఉఫ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో సచివాలయంలో ఆయన చాంబర్లో నేడు సమావేశమై పలు అంశాలపై చర్చించింది. విద్యా సంస్థలకు సంబంధించి ఆస్తిపన్ను, కరెంటు బిల్లు, ఫీజుల పెంపు వంటి ఆర్ధిక అంశాలను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు.
భవనాల అగ్నిమాపక నిరోధక చర్యలకు సంబంధించి బిల్డింగ్ రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత నిర్మించిన భవనాలు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, పది, పదిహేను సంవత్సరాల కింద నిర్మించిన భవనాలు ఫైర్ సేఫ్టీ ఎక్విప్ మెంట్ కచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. మునిసిపాలిటీ, మండల కేంద్రాల్లో ప్లే గ్రౌండ్, కిరాయి భవనాల్లో విద్యాలయాలు నడిపించడానికి సంబంధించి నోటరీ లీజ్ పై గుర్తింపు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఇంటర్ కాలేజీలకు ఈ ఏడాది అఫ్లియేషన్ ఇవ్వడంలో సడలింపు ఇస్తామన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ లో ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కాలేజీలను వేర్వేరుగా చేసి బిల్లులు చెల్లించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. డిగ్రీ కాలేజీలలో యూనివర్శిటీలు నిర్ణయించిన ఫీజులు, దోస్త్ లో నిర్ణయించిన ఫీజులు ఈ-పాస్ లో ప్రతిబింబించే విధంగా సాంకేతిక సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. డిగ్రీ, పీజీ కోర్సులకు యూనివర్శిటీలు నిర్ణయించే ఫీజులను క్రమబద్దీకరించే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రభుత్వ విద్యాలయాలు, ప్రైవేట్ విద్యాలయాలు ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని చెప్పారు. ప్రైవేట్ విద్యాలయాలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం చాలా సానుకూలంగా చూస్తోందని, వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తోందన్నారు.
విద్యాలయాల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించే నేపథ్యంలో పరీక్షలకు యాజమాన్యాలు పూర్తిగా సహకరించి విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో విద్యాశాఖ తరపున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యా సంచాలకులు కిషన్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి బుద్ధప్రసాద్, డైరెక్టర్ కరుణాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేజీ టు పీజీ విద్యాలయాల జేఏసీ నేతలు రమణారెడ్డి, పాపిరెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.