భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 68 ఏళ్లు అవుతున్నా ఎస్సీ, ఎస్టీలపై ఇంకా దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉండడం తీవ్ర బాధాకరమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 111వ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని దేశవ్యాప్తంగా దళితలు ఘనంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు. దళిత జాతికి ఆయన చేసిన సేవలు గుర్తుంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన జయంతిని అధికారికంగా జరుపుతుండడం సంతోషకరమన్నారు.
ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం అమలు విషయంలో, దానిని నీరుగార్చే విషయంలో ఇటీవల ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు, కోర్టుల తీరుపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించే అత్యాచార నిరోధక చట్టం కోరలు తీసే విధంగా ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దళితులు ఇటీవలే కొంత చైతన్యం పొందుతూ వారి హక్కులను కాపాడుకుని, చట్టాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తుండగా…వారిని అన్ని రకాల అణగదొక్కే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఈ వర్గాల సమగ్ర అభివృద్ధికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చట్టాలు చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం వాటిని నీరుగార్చే కుట్ర చేస్తోందని, దీనికి కోర్టులు వంతపాడడం బాధాకరమన్నారు.
ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం 1989ను నీరుగార్చి ముందస్తు అరెస్టులు చేయకుండా, రిమాండ్ కు పంపకుండా కేంద్రం ప్రయత్నించడంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ చట్టానికి సడలింపులు చేస్తే ఈ వర్గాల భవిష్యత్ ఏమిటని ప్రశ్నించారు. చట్టం ఉండగానే దళితులు, గిరిజనులపై దాడులు జరుగుతుంటే..ఈ చట్టం కోరలు పీకేస్తే ఇక వీరి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉందన్నారు. ఇటీవలే భారత్ బంద్ సందర్భంగా 13 మంది దళితులు చనిపోయారని, వారి మరణాలకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో ఈ చట్టం ను నీరుగార్చేందుకు జరుగుతున్నప్రయత్నాలను కేంద్రం గట్టిగా అడ్డుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఇప్పటికే ఈ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలను ఖండించారని తెలిపారు. ఎన్డీఏకు దళితులపై నిజంగా ప్రేమ ఉంటే సుప్రీం కోర్టును ఒప్పించి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాన్ని మానుకునేలా చేయాలని విజ్ణప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సభ్యులు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.