ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్ళక్రితం కనకదుర్గ వారధిని ప్రారంభించారు. అరకిలోమీటరు కూడా ఉండదు. ఇంతవరకూ పూర్తి కాలేదు. కానీ తెలంగాణాలో బహుళార్ధసాధక ప్రాజెక్ట్ కాళేశ్వరం మాత్రం దాదాపు పూర్తి కావచ్చింది.
ప్రతి సోమవారాన్ని ‘కాళవారం’ అనలేదు. ముఖ్యమంత్రి వారానికోసారి ప్రాజెక్ట్ ఏరియా కు వెళ్లి రంకెలు వెయ్యడం లేదు. కాంట్రాక్టర్లను, కూలివారిని వేలుచూపి బెదిరించడం లేదు. హెచ్చరించడం లేదు…”ఏయ్ జానారెడ్డి… రాసుకో… 2017 మార్చి కల్లా నీటిని విడుదల చెయ్యకపోతే నాపేరు అది.. ఇది కాదు” అని నీటిపారుదలశాఖా మంత్రి హరీష్ రావు వెటకారాలాడలేదు…పాతికసార్లకు పైగా నిశ్శబ్దంగా ప్రాజెక్టును సందర్శించి, అధికారులను జవనాశ్వల్లాగా పరుగులెత్తించి ప్రాజెక్ట్ నిర్మాణం శరవేగంగా సాగటానికి వర్ణించలేని కృషి చేశారు.
రేపు జూన్ జులై నాటికి ప్రాజెక్ట్ పూర్తి అయి సుమారు పద్దెనిమిది లక్షల ఎకరాలను సస్యశ్యామలం చెయ్యడానికి ఉరకలెత్తుతున్నది.
కేవలం నాలుగేళ్లలో అతి పెద్ద నీటి పారుదల ప్రాజెక్ట్ పూర్తి కావడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి. ముఖ్యమంత్రి కేసీయార్ కు అనుభవం లేకపోవచ్చు. కానీ చిత్తశుద్ధి ఉన్నది. అకుంఠిత దీక్ష ఉన్నది. తెలంగాణ ప్రజానీకం తనను గుండెల్లో పెట్టుకోవాలనే గుప్పెడంత కోరిక ఉన్నది. అందుకే తన చేతితోనే ప్రారంభం చేసి తన చేతితోనే పూర్తి చెయ్యబోతున్నారు.
అందుకోసం ఆయన కేంద్రాన్ని ఒప్పించి అన్నిరకాల అనుమతులను సాధించారు. పొరుగురాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ఒప్పించారు. కేంద్ర జలవనరుల సంఘం తొలుత ఈ ప్రాజెక్టును కట్టే సామర్ధ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నదా అని శంకించింది. కానీ, మొన్ననే కేంద్ర జలవనరుల సంఘం అధ్యక్షుడు ఈ ప్రాజెక్టును సందర్శించి ఆనందబాష్పవాలు రాల్చి “కాళేశ్వరం ఒక అద్భుతం’ అని కీర్తించి వెళ్ళిపోయాడు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం, కేసీయార్ కీర్తి చంద్రికలను ఆచంద్రతారార్కం నిలుపుతాయి. పనిచేసి చూపించి ఓట్లు అడగడం వేరు… ఓట్లు వెయ్యండి..అది సాధిస్తా..ఇది సాధిస్తా అని డంబాలు పలకడం వేరు!
ఏమైనా, కేసీయార్ ను ముఖ్యమంత్రిని చేసుకుని తెలంగాణ తన అదృష్టరేఖను అంబరాన్ని తాకించుకున్నది.
సోర్స్ : ఇలపావులూరి మురళీ మోహన రావు గారి సౌజన్యంతో