రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేయడం నిప్పుతో చెలగాటమేనని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.కేటీఆర్ నిప్పులాంటి వారని, నిప్పుతో చెలగాటం వద్దని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తే ఉత్తమ్ కు ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.ప్లీనరీ విజయవంతం కావడానికి కృషి చేసిన అన్ని కమిటీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి, శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్ కార్యదర్శి గట్టు రామచంద్రరావుతో కలిసి కర్నె ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు.
టీఆర్ఎస్ ప్లీనరీని అందరూ తమ ఇంట్లో కార్యంలా భావించి విజయవంతం చేశారని అన్నారు.అత్యుత్తమ కంపెనీలకే పారదర్శక పారిశ్రామిక విధానంలో భూములు కేటాయించామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో అడ్డగోలుగా భూ పందేరం జరిగిందని విమర్శించారు. అనేక సెజ్ లను పారిశ్రామిక వేత్తలకు దోచి పెట్టిన కాంగ్రెస్ నేతలా కేటీఆర్ మీద మాట్లాడేది? అని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో పరిశ్రమలు మూతపడితే, ఇపుడు కొత్త పరిశ్రమలు వస్తున్నాయని వివరించారు. కాంగ్రెస్ నేతలు చిల్లర మాటలు మానుకోవాలని హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో జాతీయ పార్టీల నేతలతో ఉన్న పరిచయాలతో సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను తీర్చిదిద్దుతున్నారని కర్నె తెలిపారు. సిట్టింగ్ లకే సీట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పడం సమంజసమేనని అన్నారు..హైదరాబాద్ వేదికగానే జాతీయ రాజకీయాలను నడుపుతామని సీఎం కేసీఆర్ స్పష్టంగా ప్రకటించారని ..కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ రాజకీయ శక్తిని రూపొందిస్తారని తెలిపారు.తెలంగాణ బిడ్డ పీవీ దేశానికి ప్రధాని అయినప్పుడు పార్టీలకు అతీతంగా అభినందించారని, కేసీఆర్ జాతీయ స్థాయిలో రాణిస్తే తెలంగాణ బిడ్డలుగా ఆదరించాల్సింది పోయి కాంగ్రెస్ నేతలు కురచగా మాట్లాడుతున్నారని కర్నె ప్రభాకర్ విమర్శించారు.