సీఎం కేసీఆర్ ఇవాళ చెన్నై పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రెసిడెంట్ కరుణానిధి, వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్… డీఎంకేతో మొదటి యూపీఏ ప్రభుత్వంలో పని చేసినట్లు గుర్తు చేశారు. భారతదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్నారు. కేంద్రం రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలన్నారు .
స్టాలిన్ తో చాలా విషయాలు చర్చించామన్నారు. ఇది ప్రారంభం కాదు..ముగింపుకాదు మా స్నేహం మున్ముందు కూడా కొనసాగుతుందన్నారు. రాజకీయాల్లో మార్పు కోసం మమతా బెనర్జీతో చర్చించామని తెలిపారు. రైతుల కోసం తెలంగాణలో అనేక పథకాలను ప్రవేశపెట్టామని తెలిపిన కేసీఆర్.. తెలంగాణలో భూ రికార్డులను ప్రక్షాళన చేశామని, రైతులకు మే నెలలో పంటకు పెట్టుబడి సాయంకింద రూ. 8 వేలు అందిస్తున్నామన్నారు.
రైతుబంధు పథకం ప్రారంభోత్సవానికి స్టాలిన్ ను ఆహ్వానించినట్లు చెప్పారు. కరుణానిధి తనకు మంచి పుస్తకాలను బహుకరించారని తెలిపిన కేసీఆర్..దేశ రాజకీయాలపై కరుణానిధి దిశానిర్దేశం చేశారని చెప్పారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడని.. ఫ్రంట్ గురించి ఆయనతో చర్చిస్తున్నామని.. భవిష్యత్ లో కూడా చర్చిస్తామని చెప్పారు.